ఎంతకు ఒడిగట్టావురా..!అదనపు కట్నం కోసం భార్య గొంతు కోసిండు..నాగోల్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనరసింహ కాలనీలో ఘటన

ఎంతకు ఒడిగట్టావురా..!అదనపు కట్నం కోసం  భార్య గొంతు కోసిండు..నాగోల్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనరసింహ కాలనీలో ఘటన

ఎల్బీనగర్, వెలుగు: అదనపు వరకట్నం కోసం భార్యను తరచూ వేధిస్తున్న ఓ వ్యక్తి చివరికి పేపర్​కట్టర్​బ్లేడ్​తో ఆమె గొంతు కోశాడు. పోలీసులు, బాధితురాలి పేరెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఒంగోలు జిల్లా కొనిజేడుకు చెందిన ఉప్పుతల్లి వేణుగోపాల్ తో అదే జిల్లా కందుకూరుకు చెందిన(హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో సెటిల్​అయిన) తన్నీరు మహాలక్ష్మికి 2024 ఆగస్టు 28న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 15 తులాల బంగారం, రూ.10 లక్షలు కట్నంగా ఇచ్చారు.

 తర్వాత దంపతులు హయత్​నగర్​లోని బొమ్మల గుడిలో అద్దెకు దిగారు. మూడు నెలల క్రితం నాగోల్​లక్ష్మీనరసింహ కాలనీకి మారారు. అయితే కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన వేణుగోపాల్ బంగారం అమ్మేశాడు. ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకోవడంపై భార్య ప్రశ్నిస్తే కొడుతున్నాడు. అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నాడు. దంపతుల మధ్య చాలాసార్లు గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అయినా గొడవలు ఆగడం లేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం  బంధువుల ఇంట్లో గృహప్రవేశానికి రావాలని మహాలక్ష్మి భర్తను కోరింది. 

దీంతో కోపోద్రిక్తుడైన వేణుగోపాల్ పేపర్ కట్టర్ బ్లేడ్​తో ఆమె గొంతు కోశాడు. ప్రతిఘటించిన సమయంలో మహాలక్ష్మి కుడి చేతి చిటికెన వేలు తెగిపోయింది. బాధితురాలు కేకలు వేయడంతో పక్కింటివారు డయల్100కు సమాచారం ఇచ్చారు. సీఐ మక్బుల్​జానీ సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలిని సుప్రజా హాస్పిటల్​కు తరలించారు. 

మహాలక్ష్మికి ఆపరేషన్​చేశామని, 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంటుందని డాక్టర్​అశ్విన్ తెలిపారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ, బాధిత కుటుంబసభ్యులు పైసా చెల్లించకున్నా మానవతా దృక్పథంతో మహాలక్ష్మికి ఉచితంగా ఆపరేషన్​చేశామని దవాఖాన ఎండీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసు నమోదు చేసి వేణుగోపాల్​ను అరెస్ట్​చేసినట్లు సీఐ పేర్కొన్నారు.