
భర్త వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిన భార్య
తప్పు చేస్తే కౌన్సిలింగ్ ఇవ్వాలి.. కొడతారా?
పోలీసులపై సీపీకి ఫిర్యాదు చేసిన భర్త
నేరెడ్మెట్, వెలుగు: తన భర్త వేధిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన నేరెడ్మెట్ పీఎస్పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నరసింహస్వామి వివరాల ప్రకారం.. అనంతయ్య కాలనీలో ఉండే ముత్యాలు, విక్టోరియారాణి(33) భార్యాభర్తలు. కొన్నేండ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఇద్దరు మరోసారి గొడపడ్డారు. దీంతో విక్టోరియా తన భర్త నిత్యం మందుతాగి వేధిస్తున్నాడని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముత్యాలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ నరసింహస్వామి తెలిపారు. అయితే గొడవ జరిగిన కొంతసేపటికి విక్టోరియా కూకట్‌పల్లిలో ఉండే తన తమ్ముడు రాజుకి ఫోన్‌చేసి విషయం చెప్పింది.
రాజు స్నేహితులతో వచ్చి శనివారం రాత్రి ముత్యాలును కొట్టారు. అనంతరం విక్టోరియా పోలీసులకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసింది. నేరెడ్మెట్ పోలీసులు వచ్చి ముత్యాలును స్టేషన్‌కి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే కౌన్సిలింగ్ ఇవ్వాలి లేకపోతే జైలుకి పంపాలి. అంతేకాని కొడతారా అంటూ ముత్యాలు ప్రశ్నించారు. ఎస్ఐ సైదులు తనను ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ పీఎస్‌లోని హాలులోనే కొట్టి ఇంటికి పంపించి వేశాడని, ఆదివారం ఉదయం నిద్రలేచి చూస్తే నడవలేకపోయానని ముత్యాలు తెలిపాడు. ఈ మేరకు ముత్యాలు సీపీకి కంప్లెయింట్చేశాడు.