మంగళవారం ( జనవరి 20 ) హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో వికీపీడియా 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రిపుల్ఐటీ - హైదరాబాద్‌లోని కోహ్లి రీసెర్చ్ బ్లాక్ (కేఆర్‌బీ) ఆడిటోరియంలో ఓపెన్ నాలెడ్జ్ ఇనీషియేటివ్స్ టీమ్ ఆధ్వర్యంలో 'హైదరాబాద్ సెలెబ్రేట్స్ వికీపీడియా' పేరిట 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా వికీపీడియా సహ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్, ఐఐఐటీ ప్రొఫెసర్ వాసుదేవ వర్మలు వికీపీడియా చేస్తున్న కార్యక్రమాలపై వారి సందేశాలిచ్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
వికీమీడియన్ ఆఫ్ ద ఇయర్ ఆనరబుల్ మెన్షన్ పురస్కారం పొందిన భారతీయ వికీమీడియన్ నితేష్ గిల్ మాట్లాడుతూ... ప్రముఖ భారతీయ వికీమీడియన్ తన్వీర్ హాసన్ వికీపీడియా 25వ జన్మదినం సందర్భంగా ఈ ప్రాజెక్టుకు తాను రాసిన లేఖను వినిపించారు. "వికీమీడియా ఇన్ హైదరాబాద్: ఎ జర్నీ ఆఫ్ ఓపెన్ నాలెడ్జ్" పేరిట ఓపెన్ నాలెడ్జ్ ఇనీషియేటివ్స్ ప్రోగ్రామ్ మేనేజర్ పవన్ సంతోష్ రూపొందించిన డాక్యుమెంటరీలో నగరంలోని గోల్డెన్ థ్రెషోల్డ్ (అబిడ్స్), రవీంద్రభారతి, ఐఐఐటీ హైదరాబాద్ ఎలా వికీపీడియా కార్యకలాపాలకు కేంద్రం కావడం, అంతర్జాతీయ స్థాయిలో వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్, జాతీయ స్థాయిలో వికీకాన్ఫరెన్స్ ఇండియా వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం వంటివి ప్రదర్శించారు.
Also Read : తెలంగాణలో 6 కొత్త అర్బన్ ఫారెస్టులు
వికీమీడియన్స్ యర్రా రామారావు, విజె సుశీల, ప్రొ. రాధికా మామిడి, డాక్టర్ రాజశేఖర్, బత్తిని వినయ్ కుమార్ గౌడ్, ప్రణయ్ రాజ్ వంగరిలు ఈ కార్యక్రమంలో సందేశం వినిపించారు. అనంతరం పబ్లిక్ డొమైన్ దినోత్సవాన్ని నిర్వహించి, వికీపీడియా 25వ పుట్టినరోజు వేడుకల సందర్బంగా కేక్ కట్ చేశారు. తాము రూపొందించిన భారతీయ వికీమీడియాల డాష్‌బోర్డును నివాస్ రామిశెట్టి, కృష్ణచైతన్య వెలగా విడుదల చేశారు.
అనంతరం వక్తలు మాట్లాడుతూ.. వికీపీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో, అలాగే ఇక్కడ తెలుగు వికీపీడియా మాతృభాషలో సమాచారం అందడం సంస్కృతి పరిరక్షణకు తోడ్పడుతోందని, స్వచ్ఛంద వాలంటీర్స్ అంత కలిసి నిర్మించిన ఒక విశిష్ట విజ్ఞాన వేదికగా నిలిచిందని అన్నారు. మాతృభాషలో జ్ఞానం అందించే ఈ వేదిక తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో, విలువైన సమాచారాన్ని భవిష్యత్ తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒకేఐ (OKI) నిర్వాహకులు పవన్ సంతోష్, తన్వీర్, నితీష్ గిల్, నివాస్, కృపాల్ కశ్యప్ తదితరులు పాల్గొన్నారు.
