మహబూబాబాద్ జిల్లాలో కూలీలపై అడవి దున్నపోతుల దాడి.. ఐదుగురికి తీవ్ర గాయాలు..

మహబూబాబాద్ జిల్లాలో కూలీలపై అడవి దున్నపోతుల దాడి.. ఐదుగురికి తీవ్ర గాయాలు..

మహబూబాబాద్ జిల్లాలో అడవి దున్నపోతులు వీరంగం సృష్టించాయి.. జిల్లాలోని గంగారం, కొత్తగూడ మండలాల్లో తునికాకు కూలీలపై అడవి దున్నపోతులు దాడి చేశాయి. మంగళవారం ( మే 13 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. మంగళవారం కూలీలు పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో అడవి దున్నలు దాడి చేసినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా దున్నపోతులు వరుసగా దాడికి పాల్పడుతున్నట్లు తెలిపారు కూలీలు. ఈ దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. దున్నపోతుల దాడిలో గాయపడ్డవారిని చికిత్స కోసం నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.

మూడురోజులుగా అడవి దున్నపోతులు వరుసగా దాడి చేస్తుండటంతో భయబ్రాంతులకు గురవుతున్నారు తునికాకు కూలీలు. దున్నపోతుల దాడితో పనికి వెళ్లాలంటేనే భయంగా ఉందని... అడవి దున్నపోతుల దాడి కారణంగా తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీలు. ఫారెస్ట్ అధికారులు అడవి దున్నపోతులను కట్టడి చేసి.. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు తునికాకు కూలీలు.

అడవి దున్నపోతుల దాడితో భయం గుప్పిట్లో బతుకుతున్నామని.. పనికి వెళ్లలేకపోతున్నామని అంటున్నారు గిరిజన గ్రామాల ప్రజలు. ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు చేపట్టి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు గిరిజనులు.