- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన.. భయం గుప్పిట్లో అటవీ శివారు గ్రామాలు
- ఏనుగును ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు.. అడవి మీదుగా రాకపోకలు నిలిపివేత
ఆసిఫాబాద్/కాగజ్ నగర్/హైదరాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో రైతుపై ఏనుగు దాడిలో చనిపోయాడు. 12 గంటల వ్యవధిలో ఇద్దరు రైతులు మృతి చెందారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్లో ఈ ఘటన జరిగిందని చెప్పారు. గురువారం తెల్లవారుజామున పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలో కారు పోశన్న (55)పై ఏనుగు దాడి చేసిందని, దీంతో అతను స్పాట్లోనే చనిపోయాడని తెలిపారు. మోటార్ వేయడానికి ఇంటి నుంచి పోశన్న తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు పొలానికి బయలుదేరాడు. గ్రామ పంచాయతీ దగ్గర్లో ఉన్న చేను వద్దకు చేరుకున్నాడు. అప్పుడే ఘీంకరించిన ఏనుగు.. పోశన్నపై దాడి చేసింది. దీంతో అతను స్పాట్లోనే చనిపోయాడు. ఘీంకారం విన్న గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికొచ్చేసరికి ఏనుగు అక్కడి నుంచి పారిపోయింది. అయితే, గ్రామస్తులు పోశన్న వద్దకెళ్లి చూడగా.. అప్పటికే అతను చనిపోయాడని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.
మూడేండ్ల కింద పెద్దపులి.. ఇప్పుడు ఏనుగు
ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు చనిపోవడంతో గ్రామస్తులు భయాందోళకు గురవుతున్నారు. మూడేండ్ల కింద ఇదే గ్రామ శివారులో పత్తి ఏరుతున్న పసుల నిర్మల అనే యువతిపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. అడవికి దగ్గరగా ఉన్న గ్రామం కావడంతో ఇప్పటి దాకా పులి భయం ఉండేదని, ఇప్పుడు ఏనుగు ఇద్దరిని చంపేసిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇదే ఏనుగు చింతలమానేపల్లి మండలం బూరేపల్లి శివారులో మిర్చి ఏరుతున్న అల్లూరి శంకర్ (58)పై ఏనుగు దాడి చేసి చంపేసింది. ఫారెస్ట్ అధికారులు సరిగ్గా స్పందించడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఏనుగును ట్రాక్ చేసి దారి మళ్లించి ఉంటే పోశన్న చనిపోయేవాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫారెస్ట్ రూట్లో రాకపోకలు నిలిపివేత
ఏనుగు దాడిలో చనిపోయిన శంకర్ కుటుంబాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏనుగు దాడిలో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కోరారు. ఏనుగును ట్రాక్ చేసేందుకు కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్లోని బెజ్జూర్, పెంచికల్‌పేట, ఖర్జెళ్లి రేంజ్ అధికారులు రంగంలోకి దిగారు. బైనాక్యులర్, డ్రోన్ల సహాయంతో ఏనుగును ట్రాక్ చేస్తున్నారు. సలుగుపల్లి నుంచి పెంచికల్‌పేట, కాగజ్‌నగర్ రూట్లో రాకపోకలు నిలిపివేశారు. పోశన్నను చంపేసిన తర్వాత నుంచి ఏనుగు ఆచూకీ లభించలేదు. అటవీ మార్గం నుంచి రాకపోకలు సాగించొద్దని పోలీసులు సూచించారు. ఈ మేరకు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సురేశ్ కుమార్ కోరారు. ఏనుగు సంచరించే ప్రాంతంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే వాటిపై పాంప్లెట్ రిలీజ్ చేశారు.
మృతుడి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా
కాగజ్ నగర్ అటవీ ప్రాంతం కొండపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో చనిపోయిన కారు పోశన్న కుటుంబానికి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో సూచించారు. చింతలమానేపల్లి, పెంచికల్పేట్, బెజ్జూర్, దహెగాం ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్టు పేర్కొన్నారు.
గ్రామస్తులు అలర్ట్‌గా ఉండాలి
మహారాష్ట్ర నుంచి ఏనుగు దారితప్పి తెలంగాణలోకి వచ్చిందని, 30 మంది ట్రాకింగ్ చేస్తున్నారని కాళేశ్వరం జోన్ వైల్డ్ లైఫ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ చెప్పారు. రెండు రోజుల్లో తిరిగి ఏనుగు మహారాష్ట్ర వెళ్లిపోతుందన్నారు. ఒక వేళ వెళ్లకపోతే ఏం చేయాలో ఆలోచిస్తామని తెలిపారు. బెజ్జూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏనుగు ఇద్దరి చంపడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రూ.10 లక్షల పరిహారం ఇస్తాం. ఏనుగు కోపంలో ఉంది. రెండు రోజుల్లో కోపం తగ్గి మహారాష్ట్రకు వెళ్లిపోతుంది. గ్రామస్తులు అలర్ట్‌గా ఉండాలి. గుంపుగా తిరగాలి. ఏనుగును కంట్రోల్ చేసే విషయమై చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడుతున్నాం’’అని తెలిపారు.
‑ కాళేశ్వరం జోన్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్
ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్