అయ్యో.. చిరుత అడవి దాటితే అంతే.. తెలంగాణలో వన్య ప్రాణులకు రక్షణ కరువు

అయ్యో.. చిరుత అడవి దాటితే అంతే.. తెలంగాణలో వన్య ప్రాణులకు రక్షణ కరువు
  • తరచూ రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వన్యప్రాణులు
  • తాజాగా  మెదక్ నేషనల్ హైవేపై గుర్తుతెలియని వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఢీకొని చిరుత మృతి.. 
  • ఇటీవల నిజామాబాద్ జిల్లాలో రెండు చిరుతల కళేబరాలు లభ్యం.. ‘జే1’ పులి ఆచూకీ మిస్టరీ
  • ఘటనపై మంత్రి సురేఖ సీరియస్.. విచారణకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం మూగజీవాలకు శాపంగా మారుతున్నది. అడవుల్లో స్వేచ్ఛగా తిరగాల్సిన అరుదైన క్రూర మృగాలు, ఇతర జంతువులు వెహికల్స్‌‌‌‌‌‌‌‌ చక్రాల కింద నలిగి ప్రాణాలు వదులుతున్నాయి.

ఒకవైపు అక్రమ నరికివేతతో అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, మరోవైపు ఆహారం, తాగునీరు లభించక జనావాసాలు, రహదారుల వైపు వస్తున్న వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. కలప తరలింపు, వేటగాళ్ల ఉచ్చులపై పట్టనట్టు వ్యవహరిస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు.. జీవాలు చనిపోయాక పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రోజురోజుకూ అటవీ సంపద నాశనమైపోతున్నా.. అరుదైన వన్యప్రాణులు రహదారి ప్రమాదాల్లో బలైపోతున్నా ఫారెస్ట్ ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వన్యప్రాణుల విలువ ‘మామూళ్ల’ మాటున కనుమరుగవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఒకవైపు యథేచ్ఛగా కలప అక్రమ రవాణా.. మరోవైపు వేటగాళ్ల ఉచ్చులో వన్యప్రాణాలు బలవుతున్నా.. ఫారెస్ట్​ ఆఫీసర్లు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అసలు  అటవీశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? మూగజీవాల  ప్రాణం విలువ తెలియదా? అంటూ వన్యప్రాణి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు, ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి.

వరుస ప్రమాదాలు.. మిస్టరీగా మారిన పులి జాడ
తాజాగా మెదక్ జిల్లా హవేలీ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్ మండలం గంగాపూర్ శివారులోని మెదక్– - రామాయంపేట -– సిద్దిపేట జాతీయ రహదారిపై వాహనం ఢీకొని చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చూసి స్థానికులు, వాహనదారులు కలవరపడినా..  జిల్లా అటవీశాఖ అధికారులు లైట్‌‌‌‌‌‌‌‌గా తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో తాజాగా వెలుగుచూసిన రెండు చిరుత పులుల మృతి ఘటన అటవీశాఖను కుదిపేస్తున్నది. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ‘జే1’ పులి ఆచూకీ కోసం అన్వేషిస్తుండగా.. రెండు చిరుతల కళేబరాలు బయటపడటం కలవరపెడుతున్నది. కమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి రేంజ్ పరిధి భీంగల్‌‌‌‌‌‌‌‌లో ఒకటి.. ధర్పల్లి మండలంలో మరొక చిరుత పులి కళేబరాలు లభించాయి.  అంతేకాకుండా, మహారాష్ట్ర నుంచి వలస వచ్చి 14 జిల్లాలు తిరిగిన ఓ మగ పులి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా భీంగల్‌‌‌‌‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌లో సంచరించి.. ఆ తర్వాత అదృశ్యమైంది.

కమ్మర్‌‌‌‌‌‌‌‌పల్లి రేంజ్‌‌‌‌‌‌‌‌ పరిధిలో దూడను ‘జే1’ అనే పులి చంపేసింది. ఆ తర్వాత   జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ సరిహద్దుల్లో తిరిగినా..  ఆ పులి జాడ  నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కాగా, అడవుల్లో కొనసాగుతున్న  పోడు, స్మగ్లర్ల చెట్ల నరికివేత, అక్రమ తవ్వకాల వల్ల వన్యప్రాణుల సహజసిద్ధమైన ఆవాసాలు దెబ్బతింటున్నాయి. దీనికితోడు అడవి లోపల తాగునీరు, ఆహారం (సాంబార్లు, జింకలు) దొరక్కపోవడంతో చిరుతలు, ఇతర క్రూర మృగాలు జనావాసాలు, వ్యవసాయ పొలాల వైపు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాత్రి వేళల్లో రహదారులు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నాయి.

సమగ్ర విచారణకు ఆదేశం!
మెదక్ హైవేపై చిరుతపులి మరణించిన ఘటనపై మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.  చిరుత మృతిపై సమాచారం అందుకున్న మంత్రి.. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. చిరుతపులి మృతదేహానికి నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించి, శాస్త్రీయ ఆధారాలతో పూర్తి నివేదికను తనకు సమర్పించాలని అటవీ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల గుండా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులపై వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి హెచ్చరిక బోర్డులు, అవసరమైనచోట మరిన్ని వైల్డ్‌‌‌‌‌‌‌‌లైఫ్ క్రాసింగ్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేయాలన్నారు.

అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌లు, ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌లు నిర్మించాలి 
అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రహదారులపై వన్యప్రాణుల మరణాలను అరికట్టేందుకు పర్యావరణ వేత్తలు పలు సూచనలు చేస్తున్నారు.  నేషనల్, స్టేట్ హైవేల వద్ద జంతువులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు అండర్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌లు, ఓవర్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌లు (ఎకో-బ్రిడ్జిలు) నిర్మించాలి.  ఫారెస్ట్ ఏరియా ప్రారంభమయ్యే చోట వాహనాల వేగాన్ని గంటకు 30-40 కిలోమీటర్లకు పరిమితం చేయాలి. సీసీ కెమెరాలు, స్పీడ్ గన్ల ద్వారా నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించాలి. 

తొనిగండ్ల శివారులో చిరుత మృత్యువాత.. 
మెదక్ జిల్లా రామాయంపేట ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న చిరుత పులి తొనిగండ్ల గ్రామ శివారులో మెదక్ - సిద్దిపేట నేషనల్​ హైవే మీదుగా రోడ్డు దాటుతుండగా ​వాహనం ఢీకొని మృతిచెందింది. తలకు బలమైన గాయం కావడంతో  తీవ్ర రక్తస్రావమై చిరుత స్పాట్‌‌‌‌‌‌‌‌లోనే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, జిల్లా ఫారెస్ట్​ ఆఫీసర్ (డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో) జోజి, రామాయంపేట రేంజ్​ ఆఫీసర్​ విద్యాసాగర్​ సంఘటనా స్థలానికి  చేరుకున్నారు.

పంచనామా నిర్వహించిన అనంతరం చనిపోయిన చిరుతపులి కళేబరాన్ని అక్కన్నపేట అర్బన్ పార్క్‌‌‌‌‌‌‌‌లోకి  తరలించారు. రామాయంపేట నుంచి వెటర్నరీ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రప్పించి చిరుత పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అక్కడే దహనం చేశారు. చిరుతపులి మృతిపై రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.