ముంబై: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరం కారణంగా అతడు మ్యాచ్ ఆడలేదు. అయితే.. అనారోగ్యం నుంచి కోలుకున్న బుమ్రా గురువారం (ఫిబ్రవరి 12) అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరగనున్న రెండో మ్యాచులో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుమ్రా హెల్త్ కండీషన్‌పై తిలక్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.
నమీబియాతో మ్యాచుకు ముందు జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తిలక్ మాట్లాడుతూ.. బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని తెలిపాడు. రెండో మ్యాచుకు అతడు అందుబాటులో ఉన్నాడని చెప్పాడు. తిలక్ వ్యాఖ్యలతో నమీబియాతో జరగనున్న రెండో మ్యాచులో బుమ్రా ఆడటం ఖాయమని స్పష్టమైంది. దీంతో భారత యార్కర్ కింగ్‌తో నమీబియా బ్యాటర్లకు చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు అభిమానులు.
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. గురువారం జరిగే గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్‌లో పెద్దగా అనుభవం లేని నమీబియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్ ఉండటంతో ఇండియా బ్యాటర్లపై ప్రధానంగా దృష్టి నెలకొంది. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ మినహా మిగతా వారంతా తేలిపోయారు.
ఒక్కరంటే ఒక్కరు వికెట్ కాపాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో నమీబియాతో మ్యాచ్‌లో బ్యాటింగ్ వీరులందరూ గాడిలో పడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఏమాత్రం తేడా వచ్చినా రాబోయే మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నమీబియా బౌలింగ్‌ను చితక్కొట్టి తొలిసారి మూడొందల మార్క్‌ను అందుకోవాలని టీమిండియా ప్రణాళికలు వేస్తోంది. ఇది ఎంతవరకు విజయవంతమవుతోంది చూడాలి.
