ఐపీఎల్ 2027లో ధోని ఆడతాడా.. లేదా..? చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ సమాధానమిదే..!

ఐపీఎల్ 2027లో ధోని ఆడతాడా.. లేదా..? చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ సమాధానమిదే..!

చెన్నై: గాయం కారణంగా ఐపీఎల్ 19 సీజన్‎కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎమ్మె్స్ ధోని వచ్చే సీజన్ ఆడతాడా లేదా అనే దానిపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చాడు. వచ్చే సీజన్‌కు సంబంధించి ధోనీతో ఫ్రాంచైజీ ఎలాంటి చర్చలు జరపలేదని తెలిపారు. ఐపీఎల్‎లో ధోని భవిష్యత్తు, రిటైర్మెంట్‌పై ఎలాంటి ఒత్తిడి చేయబోమని, తుది నిర్ణయం పూర్తిగా అతనిదేనని స్పష్టం చేశారు. ధోని తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా గౌరవిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ ధోనీ ఐపీఎల్‎కు రిటైర్మెంట్ ప్రకటించినా.. కోచ్, మెంటర్ ఇలా ఏదో ఒక పాత్రలో జట్టుతో అతను అనుబంధం కొనసాగించాలని చెన్నై కోరుకుంటోందని తెలిపారు. 

‘‘మేము ఇప్పటివరకు ధోనితో వచ్చే సీజన్ గురించి ఏమీ చర్చించలేదు. ధోని తన నిర్ణయాలను స్వయంగా తీసుకుంటాడు. మేం అతడి నిర్ణయాన్ని గౌరవిస్తాము. ఆటగాడిగా, కోచ్‌గా, మార్గదర్శకుడిగా.. ఇలా ఏ హోదాలోనైనా అతను సీఎస్‌కేలో శాశ్వత సభ్యుడిగా ఉండాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటాము. ఏ నిర్ణయమైనా అతనిపైనే ఆధారపడి ఉంటుంది’’ అని కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు.

కాగా, అంతర్జాతీయ క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతోన్న విషయం తెలిసిందే. అయితే, గాయం కారణంగా మిస్టర్ కూల్ ఐపీఎల్ 19 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. టోర్నీ మధ్యలో ధోని ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగినా గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో బరిలోకి దిగకపోవడంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ సీజన్‎లో అంచనాల మేర రాణించడంలో విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. జట్టులో ధోని లేని లోటు స్పష్టంగా కనిపించింది.