ఎన్ఎఫ్ సీ నగర్ లో .. అత్తింటి ముందు మహిళ ఆందోళన

ఎన్ఎఫ్ సీ నగర్ లో .. అత్తింటి ముందు మహిళ ఆందోళన
  • అదనపు కట్నం కోసం ఇంటి నుంచి గెంటేశారని ఆవేదన

ఘట్ కేసర్, వెలుగు: అదనపు కట్నం తీసుకురాలేదని ఏడాదిగా భర్త తనను ఇంట్లోకి రానవ్వడం లేదని ఓ మహిళ వాపోయింది. శనివారం ఘట్​కేసర్​మున్సిపాలిటీ ఎన్ఎఫ్ సీ నగర్ లోని భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్ఎఫ్​సీ నగర్​కు చెందిన రామిడి ప్రతాపరెడ్డి, బుచ్చమ్మ కొడుకు విష్ణువర్థన్ రెడ్డి సాఫ్ట్​వేర్​ఉద్యోగి. ఇతనికి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సురకంటి భూపాల్ రెడ్డి, బాలమణి కూతురు రాధికతో 2020 నవంబర్లో వివాహం జరిగింది.

 రెండేండ్ల కూతురు ఉంది. విష్ణువర్థన్​రెడ్డి పెండ్లప్పుడు కట్నం కింద అత్తమామల నుంచి అర ఎకరం పొలం, 40 తులాల బంగారం, కిలో వెండి, రూ.10 లక్షలు క్యాష్​తీసుకున్నాడు. అయితే ఏడాది కింద అదనపు కట్నం తేవాలని భార్యను పుట్టింటికి పంపించేశాడు. అప్పటి నుంచి తిరిగి అత్తింటికి రానివ్వడం లేదు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా విష్ణువర్థన్​రెడ్డి హాజరుకాలేదు. 

దీంతో న్యాయం కావాలని కోరుతూ రాధిక శనివారం తల్లిదండ్రులతో కలిసి ఎన్ఎఫ్​సీనగర్​లోని భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగింది. తన భర్త మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించింది. విచారణ జరిపి న్యాయం చేయాలని కోరింది.