- నిందితుడి అరెస్ట్
మాదాపూర్, వెలుగు: మాదాపూర్ సిద్ధిక్‌నగర్‌లోని ఓ ఓయో హోటల్‌లో యువతి మృతి చెందిన కేసులో ప్రియుడే హంతకుడని పోలీసులు తేల్చారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. జార్ఖండ్‌కు చెందిన షరోన్ నిఖిత టోప్నో(29), వైజాగ్ లో నివాసం ఉండే అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ఎడుమెట్ల మర్రిపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రవితేజ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉద్యోగం చేస్తున్న నిఖిత, ప్రియుడితో కలిసి ఈ నెల 21న మాదాపూర్ లోని ఓయో హోటల్‌కు వెళ్లింది. అక్కడ పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, రవితేజ ఆమె తల, ముఖంపై తీవ్రంగా గాయపరిచి హత్య చేశాడు.
అనంతరం హోటల్ సిబ్బందితో కలిసి ఆమెను దవాఖానకు తరలించగా, నిఖిత అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. హోటల్ గదిలో లభించిన రక్తపు మరకలు, ఆధారాల ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ లోపు స్వగ్రామంలో ఆత్మహత్యాయత్నం చేసిన రవితేజ కోలుకున్నాక.. పోలీసులు అతడిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మాదాపూర్ పోలీసులు పేర్కొన్నారు.
