గ్వాలియర్ జిల్లాలో నాలుగు కాళ్ల చిన్నారికి జన్మనిచ్చిన మహిళ

 గ్వాలియర్ జిల్లాలో నాలుగు కాళ్ల చిన్నారికి జన్మనిచ్చిన మహిళ

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ మహిళ నాలుగు కాళ్లతో ఉన్న ఓ చిన్నారికి జన్మనిచ్చింది. సికందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహా స్థానిక కమల రాజా ఆసుపత్రిలోని మహిళా శిశు వైద్య విభాగంలో పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ నవజాత శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఆడ శిశువు బరువు 2.3కిలోలు ఉండగా..పుట్టుకతోనే ఈ పాపకు నాలుగు కాళ్లు్న్నాయని జయరోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్కేఎస్ ధాకడ్ చెప్పారు. ఈ ప్రక్రియను వైద్య భాషలో ఇస్కియోపాగన్ అంటారన్నారు. తల్లి కడుపులోని పిండం రెండు భాగాలు విభజింపబడినపుడు, రెండు చోట్ల శరీరం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

ప్రస్తుతం ఈ చిన్నారి శరీరంలో ఇంకేదైనా అవయవంలో వైకల్యం ఉందా అన్న విషయంపై పిడియాట్రిక్ డిపార్ట్ మెంట్ వైద్యులు పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల తర్వాత శిశువు ఆరోగ్యంగా ఉంటే శస్త్ర చికిత్స ద్వారా ఆ కాళ్లను తొలగిస్తారని వైద్యులు చెప్పారు. ఆ తర్వాత అందరిలాగే ఆ చిన్నారి సాధారణ జీవితాన్ని గడపవచ్చన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం శిశువు ఆరోగ్యంగా ఉందని, కమల రాజా హాస్పిటల్‌ ఉన్న పీడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్‌లోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్‌లో పాప ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.