మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం తర్వాత.. ఆర్టీసీ బస్సుల్లో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. సీట్ల విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు ఎప్పుడూ ఉండేవే అయినప్పటికీ.. టికెట్ విషయంలో జరిగిన వాదన.. కండక్టర్ చెంప పగలగొట్టే వరకు వెళ్లింది. మంగళవారం (ఏప్రిల్ 07) విజయవాడ నుంచి విసన్న పేట వెళ్తున్న బస్సులో ఓ మహిళ కండక్టర్ చెంపకేసి కొట్టడం ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది.
మంగళవారం ఉదయం ఇద్దరు మహిళలు విజయవాడ నుంచి విసన్నపేట వెళ్లే బస్సు ఎక్కారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే టికెట్టు తీసుకోవాలని కండక్టర్ కోరాడు. మూడు ఆధార్ కార్డులు చూపించి రెండు టికెట్లు ఇవ్వాలని కోరడంతో వివాదం చెలరేగింది. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో కండక్టర్ చెంప పగలకొట్టింది మహిళ.
మహిళ చేయి చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాదన ఎక్కువైంది. దీంతో బస్సుతో సహా స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరింది. తనను అసభ్యకరంగా దూషించారని.. అందుకే కొట్టానని పోలీసులకు మహిళ చెప్పింది. టికెట్టు తీసుకోవాలని మాత్రమే తాను చెప్పానని, దూషించలేదని కండక్టర్ చెప్పారు. డ్యూటీలో ఉన్న కండక్టర్ పై చేయి చేసుకున్నందుకు మహిళపై కేసు నమోదు చేశారు పోలీసులు.
