పాత నోట్లకి కొత్త కళ!

పాత నోట్లకి కొత్త కళ!

‘పెద్ద నోట్లు ఇక చెల్లవు’ అని చెప్పినప్పుడు మనదేశంలో చాలామంది పాత కరెన్సీ నోట్ల కట్టల్ని చెత్తకుండీల్లో పడేశారు. వెనిజులాలో కూడా అలానే జరిగింది. అక్కడి జనం కూడా తమ దగ్గరున్న పాత నోట్లని చెత్తకుండీల్లో పడేశారు. కానీ విజువల్​ ఆర్టిస్ట్ అయిన ఈ అమ్మాయి  అలా చేయలేదు.  విలువ తగ్గిన, వాడుకలో లేని ఆ పాత నోట్లని కాన్వాస్​గా చేసుకుంది.  ఆ చెల్లని నోట్ల మీద పెయింటింగ్స్​ వేస్తూ  వాటికి కొత్త కళ తెస్తోంది.   

​వెనిజులన్​ బొలివర్​ అనేది వెనిజులా కరెన్సీ. అయితే 2014, 2016, 2018 సంవత్సరాల్లో వరుస ఇన్​ఫ్లేషన్ల (ద్రవ్యోల్బణం) కారణంగా ఆ కరెన్సీ విలువ పడిపోయింది. దాంతో ప్రభుత్వం కొత్త కరెన్సీ తెచ్చింది. పాత కరెన్సీ నోట్లన్ని చెల్లని కాగితాలు అయ్యాయి. దాంతో జనం వాటిని చెత్తకుండీల్లో పడేసేవాళ్లు. ఆ ఇన్సిడెంట్స్ చూసి​ ఇలయనీ ఆలోచనల్లో పడింది. అప్పటి వరకూ  చార్​కోల్​ సాయంతో కాన్వాస్​ మీద మాత్రమే పెయింటింగ్స్​ వేసేది. కానీ ఆ రోజు నుంచి పాత వెనిజుల బొలివర్​ నోట్ల మీద పువ్వులు, జంతువులు, పక్షుల బొమ్మలు​ వేస్తోంది. ఆమె వేసిన పెయింటింగ్స్​లో ఇటాలియన్ ఫేమస్​ ఆర్టిస్ట్ రాఫెల్​ గీసిన ‘లా ఫొర్నేరినా’ కూడా ఉంది.​ వచ్చే డిసెంబర్​లో న్యూయార్క్​లో జరగబోయే డిజిటల్​ ఎగ్జిబిషన్​కి ఈ పెయింటింగ్​ ఎంపికైంది. 

మార్పు తేవాలని...

‘‘చెత్తకుండీల్లో కుప్పల కొద్దీ వెనిజులన్​ బొలివర్​ నోట్లు పడేయడం చూసి నాకు బాధగా అనిపించింది. ఆ నోట్లని చూసినప్పుడల్లా  చాలా మందికి ‘ఆర్థికంగా, ఎమోషనల్​గా చాలా నష్టపోయాం’ వంటి నెగెటివ్​ ఆలోచనలే వచ్చేవి. వాళ్ల అభిప్రాయం మార్చాలి అనుకున్నా. 2017 నుంచి నేను పాత కరెన్సీ నోట్ల మీద బొమ్మలేస్తున్నా. నా ఆర్ట్​ చూసిన వాళ్లంతా ‘వావ్’ అని మెచ్చుకుంటున్నారు” అంటున్న ఇలయనీ  మెడిసిన్​ చదువుతోంది. అంతేకాదు ఇతర దేశాల పాత కరెన్సీ నోట్లకి కూడా రంగులద్ది, కొత్త కళ తేవాలనే ఆలోచనల్లో ఉంది ఈ యంగ్​ ఆర్టిస్ట్​.