- అంగన్‌వాడీ కాంట్రాక్టర్లకు మంత్రి సీతక్క హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు : అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం వస్తువులను సరఫరా చేస్తే కాంట్రాక్టులు రద్దు చేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు.‘‘అంగన్ వాడీ కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు, వస్తువులు సరఫరా చేయండి. చేయలేకపోతే తప్పుకోండి. ఇకపై నాసిరకం వస్తువులు, గుడ్లు సప్లై చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని కాంట్రాక్టర్లకు ఆమె వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో సప్లై కాంట్రాక్టర్లతో మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి మంత్రి సీతక్క రివ్యూ చేశారు.
అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహారపదార్థాలు, కోడి గుడ్ల నాణ్యత పెంపుపై చర్చించారు. నాణ్యమైన గుడ్లు సరఫరా చేయటం లేదని వార్తలు రావడంపై సప్లయర్లను వివరణ కోరారు. అంగన్ వాడీ సెంటర్లపై వచ్చే విమర్శలు భరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని, సప్లయర్లంతా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ గుడ్లు, ఆహార వస్తువులను సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
నాణ్యమైన వస్తువులు సరఫరా చేయకపోతే ఒప్పందాలను రద్దు చేసుకొని కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తామని మంత్రి హెచ్చరించారు. అంగన్ వాడీ టీచర్లు, సిబ్బంది మరింత క్రియాశీలకంగా పనిచేయాలని, నాణ్యత లేని వస్తువులను రిజెక్ట్ చేయాలనీ, లేకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
