ఉప్పల్, వెలుగు: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఓ లేడీ బౌన్సర్, ప్రేక్షకుడి మధ్య జరిగిన వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. బుధవారం హైదరాబాద్, పంజాబ్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం ఈ-1 గేటు వద్ద లేడీ బౌన్సర్ వజీర పర్వీన్ విధులు నిర్వహిస్తుండగా, గౌతమ్ అనే ప్రేక్షకుడిని క్యూలైన్లో రావాలని సూచించడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది.
ఈ క్రమంలో గౌతమ్ తనను వీడియో తీయడానికి ప్రయత్నించగా, వజీర పర్వీన్ అతడి ఫోన్ లాక్కుంది. అయితే, తనపై బౌన్సర్ దాడి చేసి ఫోన్ లాక్కుందని గౌతమ్ పోలీసులను ఆశ్రయించగా, క్యూలైన్లో రమ్మన్నందుకు తనతో దురుసుగా ప్రవర్తించాడని వజీర పర్వీన్ ఫిర్యాదు చేసింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
