
రాజేంద్రనగర్, వెలుగు: జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్త అకాల మరణంతో కుంగిపోతోందో ఇల్లాలు. బిడ్డను సాకేదెలా అంటూ తల్లడిల్లు తున్న సమయంలో ఇల్లు కూడా కాకుండా పోయింది. ఆస్తికోసం తనను, బిడ్డను కట్టు బట్టలతో బయటకు గెంటేశాడు ఆమె మరిది. ఆస్తిలో తనకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం వారం రోజులుగా ఇంటి ఎదుటే బైఠాయిస్తోందా మహిళ. బాధితురాలు ఎరుకాల కవిత కథనం ప్రకారం.. అత్తా పూర్ డివిజన్ సాయినగర్ కాలనీకి చెందిన ఎరుకాల పద్మమ్మ..ఎల్లయ్య దంపతులకు ముగ్గు రు కొడుకులు. వీరికి సాయినగర్ లో 75 గజాల రేకుల ఇల్లు ఉంది. పెద్ద కొడుకు గతంలోనే చనిపోయాడు.
దీంతో ఆయన వాటా కింద ఆ కుటుంబానికి 25 గజాల స్థలం కేటాయించారు. రెండో కొడుకైన కృష్ణ.. కవిత దంపతులకు ఒక కూతురు ఉంది. కృష్ణ కూడా కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఇక మిగిలిన 50 గజాల స్థలంపై కృష్ణ తమ్ముడు కుమార్ కన్నేశాడు. అన్న చనిపోవడాన్ని ఆసరాగా తీసుకుని వదిన కవితను, ఆమె బిడ్డను ఇంట్లోంచి గెంటేశాడు. ఆస్తిలో వాటా ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంతో ..కవిత కాలనీ పెద్దలను ఆశ్రయించింది. న్యాయంగా తనకు రావాల్సిన 25 గజాల స్థలాన్ని ఇప్పించాలని ప్రాధేయపడింది.
కుమార్ కు రాజకీయ నాయకుల అండ ఉండడంతో ఎవరూ ఈ విషయంలో కల్పించుకోలేదు. దీంతో ఆమె రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయినా రాజకీయ జోక్యం తో కవితకు న్యాయం జరగలేదు. దీంతో బాధితురాలు తన బిడ్డతో కలిసి అత్తారింటి ఎదుట వారం రోజులుగా దీక్ష చేస్తోంది. అయినప్పటికీ తనకు న్యాయం జరగడం లేదని, కుమార్ కరుణించడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఇంటి స్థలం ఇప్పించాలని వేడుకుంటోంది.