జనగామ కలెక్టరేట్​ను ముట్టడించిన మహిళలు

జనగామ కలెక్టరేట్​ను ముట్టడించిన మహిళలు

జనగామ, వెలుగు: ఇండ్ల స్థలాలు కేటాయించాలంటూ సుమారు రెండు వేల మంది మహిళలు బుధవారం జనగామ కలెక్టరేట్​ను ముట్టడించారు. రెండు గంటల పాటు నినాదాలతో హోరెత్తించారు. ఇండ్ల స్థలాలపై కచ్చితమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని మహిళలు బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందు జిల్లాలోని లింగాల గణపురం మండలం కుందారం క్రాస్ రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వచ్చిన మహిళలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంలో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.

జిల్లాలోని నెల్లుట్ల- పటేల్ గూడెం, చిలుకూరు మండలంలోని రాజవరం గ్రామంలో పేదలు చేస్తున్న పోరాటాన్ని గుర్తించాలని,  స్వాధీనంలో ఉన్న భూముల్లో ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సింగారపు రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకుడు ఎండీ అబ్బాస్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. ప్రసాద్ హాజరై మాట్లాడారు. నిరుపేదలు చేస్తున్న ఇండ్ల స్థలాల పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఆర్డీఓ మధు మోహన్  కలెక్టరేట్ వద్దకు చేరుకుని మహిళలతో మాట్లాడారు. నెల్లుట్ల పటేల్ గూడెం శివారులోని భూమి ప్రభుత్వానిదేనన్నారు. సమస్యను కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.