మహిళల చేతికి బస్‌‌‌‌‌‌‌‌ స్టీరింగ్‌‌‌‌‌‌‌‌.. త్వరలోనే ఆర్టీసీ డ్రైవర్లుగా మహిళా సంఘాల సభ్యులు

మహిళల చేతికి బస్‌‌‌‌‌‌‌‌ స్టీరింగ్‌‌‌‌‌‌‌‌.. త్వరలోనే ఆర్టీసీ డ్రైవర్లుగా మహిళా సంఘాల సభ్యులు
  • సెర్ప్ ఆధ్వర్యంలో మోవో సంస్థ సహకారంతో డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌లో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌
  • వంద మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు
  • తొలి బ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 24 మందికి ఇప్పటికే ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి

హైదరాబాద్, వెలుగు: అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీపడుతూ, ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న మహిళలు ఇప్పుడు మరో మైలురాయిని అధిగమించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటివరకు బస్సుల్లో ప్రయాణికులుగా మాత్రమే కనిపించిన మహిళలు... త్వరలోనే డ్రైవర్‌‌‌‌‌‌‌‌ సీటులో కూర్చొని బస్సును నడపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సెర్ప్‌‌‌‌‌‌‌‌ సహకారంతో మోవో సంస్థ సంయుక్తంగా మహిళా సంఘాల సభ్యులకు ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ అందిస్తోంది.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పరిసర ప్రాంతాల గ్రామీణ మహిళలతో పాటు నారాయణపేట, జగిత్యాల, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, మేడ్చల్‌‌‌‌‌‌‌‌ మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి తదితర జిల్లాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు. మొత్తం 100 మంది మహిళలకు భారీ వాహనాల డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఇందులో భాగంగా ఇప్పటికే తొలి బ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 24 మంది మహిళలు విజయవంతంగా ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసుకున్నారు. బస్సులు మాత్రమే కాకుండా కార్లు, త్రీ, టూ వీలర్లు నడపడంలోనూ వీరికి తర్ఫీదు ఇచ్చారు. వీరిలో ఇద్దరు మహిళలు ఇప్పటికే ఆర్టీసీలో ఇంటర్న్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించగా.. మరో నలుగురు ఫ్రెష్‌‌‌‌‌‌‌‌ బస్‌‌‌‌‌‌‌‌ సంస్థలో డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

సాఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కిల్స్‌‌‌‌‌‌‌‌లోనూ మెళకువలు
మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు 3 నెలల పాటు డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ప్రాథమిక డ్రైవింగ్ (ఎల్‌‌‌‌‌‌‌‌ఎంవీ) నుంచి ప్రారంభించి, భారీ వాహనాల లైసెన్స్‌‌‌‌‌‌‌‌ పొందే వరకు విడతల వారీగా ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తారు. బస్‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఆర్టీసీ డిపోల్లో లేదా శిక్షణ కేంద్రాల్లో ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌ సెషన్స్‌‌‌‌‌‌‌‌ సైతం ఉంటాయి. కేవలం స్టీరింగ్ పట్టుకోవడం మాత్రమే కాకుండా, మహిళలను ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్లుగా తీర్చిదిద్దేందుకు టెక్నికల్‌‌‌‌‌‌‌‌ అంశాల్లోనూ తర్ఫీదు ఇవ్వనున్నారు. 

వాహనం మధ్యలో ఆగిపోతే చిన్న చిన్న రిపేర్లు చేసుకోవడం, టైరు మార్చడం, ఆయిల్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌ చేయడం వంటి ప్రాథమిక అంశాలు నేర్పుతారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ నిబంధనలు సిగ్నల్స్, రోడ్డు గుర్తులు, రవాణా శాఖ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా.. ప్రయాణికులతో ఎలా మాట్లాడాలి, క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలి, సమయపాలన వంటి వాటిపై కూడా ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వనున్నారు.

ప్రయాణంలో ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతింటే ప్రాథమికంగా చేయాల్సిన చికిత్సపై అవగాహన కల్పిస్తారు. మహిళా డ్రైవర్ల రక్షణ కోసం ప్రాథమిక ఆత్మరక్షణ మెళకువలు, గూగుల్‌‌‌‌‌‌‌‌ మ్యాప్స్‌‌‌‌‌‌‌‌ వాడడం, డిజిటల్‌‌‌‌‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌ తీసుకోవడం తదితర అంశాలపై ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తారు. అంతేకాకాకుండా.. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ల జారీలోనూ మోవో సంస్థ సహకారం అందిస్తోంది. 

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా, వారికి గౌరవప్రదమైన ఉపాధిని కల్పించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కాగా, మంత్రి సీతక్క సూచనల మేరకు భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల మహిళా సంఘాల సభ్యులకు ఈ అవకాశం కల్పించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ మహిళలు రవాణా రంగంలో ఉపాధి పొంది ఆర్థికంగా బలోపేతం కానున్నారు.

మహిళా సాధికారతకు నిదర్శనం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష. మహిళా సంఘాల సభ్యులు డ్రైవర్లుగా మారడం సంతోషకరం. త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళా డ్రైవర్లను చూడబోతున్నాం. మహిళా సాధికారత, ఉపాధి కల్పనకు ఈ కార్యక్రమం నిదర్శనం. బస్సులు, ఆటోలు నడుపుతూ వారు సమాజంలో గౌరవప్రదంగా ఎదగాలి. మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే మా ప్రభుత్వం ఉద్దేశం. మోవో సంస్థ, సెర్ప్ సమన్వయంతో ఇస్తున్న ఈ శిక్షణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.

మంత్రి సీతక్క

డ్రైవర్‌‌‌‌‌‌‌‌ సీట్లో కూర్చోవడం గర్వంగా ఉంది 
గతంలో ఇంటికే పరిమితమైన మాలాంటి మహిళలను గుర్తించి, ప్రోత్సహించిన రాష్ట్ర  ప్రభుత్వం, సెర్ప్‌‌‌‌‌‌‌‌కు కృతజ్ఞతలు. వీరి సహకారంతో నేను ప్రస్తుతం ‘ఫ్రెష్‌‌‌‌‌‌‌‌ బస్‌‌‌‌‌‌‌‌’లో డ్రైవింగ్​లో శిక్షణ తీసుకుంటున్నా. బస్సును నడుపుతూ లేడీ డ్రైవర్‌‌‌‌‌‌‌‌ అని పిలిపించుకోవడం గర్వంగా ఉంది. శిక్షణ కాలంలోనే మాకు జీతం కూడా ఇస్తుండడం మా కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. మాలాంటి మహిళలు చాలా మంది ముందుకు రావాలి. అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నా. ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన మోవో సంస్థకు, సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.

పి.నిర్మల, ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న మహిళ

డ్రైవింగ్​ అంటే ఇష్టం 
నాకు డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ అంటే ఇష్టం. బస్‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలన్న కోరిక ఎప్పటి నుంచి ఉండేది. మోవో సంస్థ ఇచ్చిన శిక్షణ ఉపాధికి బాటలు వేసింది. డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు స్కిల్స్‌‌‌‌‌‌‌‌పై కూడా శిక్షణ ఇచ్చారు. హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉండి 31 రోజులపాటు శిక్షణ తీసుకున్న. పురుషులతో సమానంగా మేము కూడా బస్సు నడపగలమన్న ధీమా పెరిగింది. ప్రస్తుతం ప్రెష్​ బస్‌‌‌‌‌‌‌‌ సంస్థలో పనిచేస్తున్న. మొదటి నెల జీతం కూడా వచ్చింది. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ నెల శాలరీతో మా పాప ఫీజు కట్టాను. చాలా సంతోషంగా ఉంది.

అండాల్, మేడ్చల్‌‌‌‌‌‌‌‌ మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి