
- మియాపూర్లో ఘటన
మియాపూర్, వెలుగు: కన్న కూతురుపై ఓ తల్లి తన రెండో భర్తతో కలిసి చిత్రహింసలకు గురిచేయగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మియాపూర్ హఫీజ్ పేటలో నివాసముంటున్న షభ నజ్విమ్(21) తో ముషీరాబాద్ కు చెందిన తాజ్ ఉద్దిన్ వివాహం 2020 ఫిబ్రవరి 16 న జరిగింది. వీరికి రెండు, నాలుగేళ్లు వయస్సు ఉన్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
భార్యాభర్తలకు తరచూ గొడవలు జరిగేవి. దీంతో నజ్విమ్ భర్త తాజ్ ఉద్దిన్ తో ఆరు నెలల క్రితం విడాకులు తీసుకొని ఇద్దరు పిల్లలతో కలిసి హఫీజ్ పేటలో ఉంటోంది. ఈ క్రమంలో రెండు నెలల కింద జోగిపేటకు చెందిన మహ్మద్ జావీద్( 22)ను రెండో పెళ్లి చేసుకుని పిల్లలతో కలిసి అదే ఏరియాలో ఉంటోంది. కొంత కాలంగా షబ నజ్విమ్ తన కుమార్తె(4)ను ప్రతి చిన్న విషయానికి కొడుతోంది. రెండో భర్తతో కలిసి దారుణంగా కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తోంది.
గోర్లు తొలగించి కారంపొడి వేసి, విద్యుత్ తీగలతో కొట్టడం, శరీరంపై వాతలు పెడుతూ నరకం చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 1న చిన్నారి బయటికి రాగా ఒంటిపై వాతలు కనిపించాయి. దీంతో స్థానికులు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తల్లితో పాటు పినతండ్రిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.