- డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి సీతక్క
ఎర్రుపాలెం, వెలుగు : మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఆర్థికాభివృద్ధి సాధించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క సూచించారు.
ఖమ్మం జిల్లా వెంకటాపురంలో రూ. 3 కోట్లతో నిర్మించిన ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్‌ను బుధవారం వారు ప్రారంభించారు. అనంతరం వెంకటాపురంలో మహిళల పెట్రోల్ బంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండొద్దన్న ఉద్దేశంతో ఉత్పత్తిని 18,480 మెగావాట్లకు పెంచామని చెప్పారు.
సోలార్ ప్లాంట్ల నిర్వహణపై మహిళకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చామని, ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఆదాయంతో మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని సూచించారు. మహిళలకు గతంలో రూ. 5 లక్షల వడ్డీ లేని రుణాలను ఇవ్వగా.. బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 10 లక్షలకు పెంచామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ... గత పాలకులు మహిళలకు చేసిందేమీ లేదన్నారు.
మహిళలు ఆదానీ, అంబానీలతో పోటీపడి వ్యాపారం చేయాలని ఆకాంక్షించారు. ఎర్రుపాలెం మహిళలు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఆర్థికభరోసా పొందాలని సూచించారు. అనంతరం చైతన్య మండల సమాఖ్యకు రూ.10.45 కోట్ల చెక్కును అందజేశారు. త
ర్వాత రాజుల దేవరపాడు గ్రామంలోని కొత్తగా కట్టిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, సెర్పీ సీఈవో దివ్య, ఎన్పీడీసీఎల్ సీఈవో వరుణ్‌రెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్‌దత్, రెడ్కో చైర్మన్ అనిలా, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో శ్రీరాం పాల్గొన్నారు.
