మహిళా సంఘాలకు ‘ట్రాక్టర్ల’ కష్టాలు..అద్దెకు తీసుకోని రైతులు.. కిస్తీలు కట్టలేక ఇబ్బందులు

మహిళా సంఘాలకు ‘ట్రాక్టర్ల’ కష్టాలు..అద్దెకు తీసుకోని రైతులు.. కిస్తీలు కట్టలేక ఇబ్బందులు
  • గతంలో స్త్రీ నిధి రుణాలతో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయించిన డీఆర్​డీఏ అధికారులు
  • కొన్నాళ్లుగా అందని అద్దెలు, డ్రైవర్ల కొరతతో తీవ్ర నష్టాల్లో మహిళా సమాఖ్యలు
  • మూలన పడిన ట్రాక్టర్లు, యంత్రపరికరాలు
  • సంఘాల డిపాజిట్ వడ్డీ నుంచి కిస్తీలు కట్ చేసుకుంటున్న వైనం
  • ఇదీ.. వనపర్తి జిల్లాలోని మహిళా సంఘాల పరిస్థితి.. 

వనపర్తి, వెలుగు :వనపర్తి జిల్లాలో మండల సమాఖ్యల్లోని మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు స్త్రీ నిధి కింద భారీ రుణాలు ఇప్పించి ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయించారు. వీటిని రైతులకు అద్దెకు తిప్పుతూ వచ్చే ఆదాయంతో ఆర్థిక పరిపుష్టి సాధించాలని ప్రోత్సహించారు. అయితే, గ్రామాల్లో అప్పటికే ప్రైవేటు ట్రాక్టర్లు అందుబాటులో ఉండడం, మహిళా సంఘాలకు వీటి నిర్వహణపై అవగాహన లేకపోవడంతో రైతులు వీటిని అద్దెకు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

11 మండల సమాఖ్యలకు పంపిణీ

వనపర్తి జిల్లాలో మొత్తం 11 మండల సమాఖ్యలకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. అందులో వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, శ్రీరంగాపూరు, పెద్దమందడి, వీపనగండ్ల, గోపాల్​పేట, ఖిల్లాగణపురం, మదనాపూరు, పాన్​ గల్​ మండల సమాఖ్యలు ఉన్నాయి. వీటికి  బహుళపంటల నూర్పిడి యంత్రాలు, ట్రాక్టర్లు, నీటి ట్యాంకులు, వ్యవసాయ పరికరాలు అందించారు. కానీ, క్షేత్ర స్థాయిలో వీటి వాడకం ఉండకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదు. సమాఖ్యలూ ఆందోళన చెందుతున్నాయి. 

ఆశించిన ఆదాయం రాక.. 

సంఘాల వద్ద ఉన్న ట్రాక్టర్లకు డ్రైవర్లు లేకపోవడం, అద్దె నగదు రూపంలో చెల్లించాల్సి రావడంతో రైతులు స్థానికంగా ఉన్న ఇతరుల వద్దే ఉద్దెరకూ, సులభ పద్ధతుల్లో పనులు కానిచ్చేస్తున్నారు. దీంతో ట్రాక్టర్ల ద్వారా ఆశించిన ఆదాయం రాక, నెలవారీ కిస్తీలు చెల్లించడం సంఘాల ప్రతినిధులకు భారంగా మారింది. ఈ ఇబ్బందులపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతినెలా కిస్తీలు వసూలు చేస్తూనే ఉన్నారు. 

సమాఖ్య నిధుల్లోంచి కోతలు..

మండల మహిళా సమాఖ్యలు స్త్రీ నిధి బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్న రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉన్న నిధుల వడ్డీ నుంచి, ఈ ట్రాక్టర్ల రుణాల కిస్తీలను అధికారులు కోత విధిస్తున్నారు. ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల కొనుగోలుకు స్త్రీ నిధి పథకం ద్వారా రూ.12లక్షల నుంచి రూ.25లక్షల వరకు మండల మహిళా సమాఖ్యలు రుణాలు తీసుకున్నాయి. యంత్రాలు అద్దెకు పోకపోతాయా అన్న ఆశతో  సభ్యులు ప్రారంభంలో నెలవారీ కిస్తీలు కడుతూ వచ్చారు. కానీ, ప్రస్తుతం గిరాకీ లేక కిస్తీలు చెల్లించలేకపోతున్నామని మహిళా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నివేదిక తెప్పించుకుంటున్నాం

స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలకు ఇచ్చిన వ్యవసాయ యంత్ర పరికరాలు, ట్రాక్టర్ల వినియోగంపై వస్తున్న ఇబ్బందులు కమిషనర్ దృష్టికి వెళ్లాయి. ఇటీవల మహిళా సంఘాలు వ్యవసాయ యంత్ర పరికరాలను ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, అనే అంశాలపై ఒక అధికారిని జిల్లాకు పంపి నివేదిక తెప్పించుకున్నారు. త్వరలోనే మహిళా సంఘాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కమిషనర్ ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

-ఇన్చార్జి  డీఆర్​డీఓ రామ మహేశ్వర్ రెడ్డి