మసీదు ప్రారంభోత్సవానికి హాజరవ్వను: యోగి ఆదిత్యనాథ్

మసీదు ప్రారంభోత్సవానికి హాజరవ్వను: యోగి ఆదిత్యనాథ్

లక్నో: ఉత్తర్‌‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షమాపణలు చెప్పాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేసింది. అయోధ్యలో కూలగొట్టిన బాబ్రీ మసీదును మళ్లీ నిర్మిస్తే ఆ మసీదు ప్రారంభోత్సవానికి తాను హాజరు కాబోనని యోగి అన్నారు. రీసెంట్‌గా అయోధ్యలో రామ మందిర భూమి పూజ కార్యక్రమం ముగిసిన తర్వాత టెలివిజన్‌లో మాట్లాడుతూ యోగి పైవ్యాఖ్యలు చేశారు. వీటిపై ఎస్పీ మండిపడింది. ఓ యోగిగా, హిందువుగా తాను మసీదు ప్రారంభోత్సవానికి వెళ్లబోనని ఆదిత్యనాథ్ చెప్పడాన్ని ఎస్పీ విమర్శించింది. రాష్ట్ర ప్రజలకు యోగి సారీ చెప్పాల్సిందేనని ప్రతిపక్ష ఎస్పీ డిమాండ్ చేస్తోంది. కాగా, యోగి వ్యాఖ్యలపై స్పందించేందుకు యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిరాకరించడం గమనార్హం.

‘ఓ ముఖ్యమంత్రిగా కుల, మత నమ్మకాలతో నాకెలాంటి సమస్య లేదు. కానీ ఒక యోగిగా అయితే మాత్రం నేను తప్పనిసరిగా వెళ్లననే చెబుతా. ఎందుకంటే హిందువుగా నా ఉపాసన విధిని వెలిబుచ్చే హక్కు నాకుంది. నేను వాదిని కాదు ప్రతివాదినీ కాదు. అందుకే నన్నెవరూ ఆహ్వానించరు, నేనూ వెళ్లను. నాకు అలాంటి ఇన్విటేషన్ కూడా రాదు. వాళ్లు నన్ను పిలిచిన రోజు చాలా మంది నమ్మే సెక్యూలరిజం ప్రమాదంలో పడుతుంది. అందుకే వారి సెక్యూలరిజం ప్రమాదంలో పడకూడదనే ఉద్దేశంతోనే నేను నిశ్శబ్దంగా పని చేసుకుంటున్నా. ప్రభుత్వ పథకాలు ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ చేరాలన్నదే మా ఉద్దేశం’ అని యోగి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎస్పీ అధికార ప్రతినిధి పవన్ పాండే మండిపడ్డారు

‘ఆయన హిందూ కమ్యూనిటీకి మాత్రమే కాదు.. మొత్తం రాష్ట్రానికే సీఎం. హిందూ, ముస్లింల జనాభాకు సంబంధం లేకుండా ఆయన అందరికీ సీఎం. ముఖ్యమంత్రి మాట్లాడిన భాషలో డిగ్నిటీ కొరవడింది. ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని పవన్ పాండే విమర్శించారు.