ఇంజనీరింగ్ చదివి కూలీపని చేస్తున్న వర్క్​ ఇన్​స్పెక్టర్లు

ఇంజనీరింగ్ చదివి కూలీపని చేస్తున్న వర్క్​ ఇన్​స్పెక్టర్లు
  • ప్రభుత్వం జాబ్​ల నుంచి తీసేయడంతో ‘భగీరథ’ వర్క్​ ఇన్​స్పెక్టర్ల కష్టాలు
  • రోడ్డునపడ్డ 709 కుటుంబాలు 
  • బతుకుదెరువు కోసం డ్రైవింగ్, వ్యవసాయం, కూలీ పనులకు..
  • ఇప్పటికైనా డ్యూటీలోకి తీసుకోవాలంటూ మొర

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటింటికీ తాగు నీరందించే మిషన్ భగీరథ పథకం సక్సెస్ కోసం ఐదేండ్ల పాటు ఫీల్డ్ లెవల్​లో పని చేసిన వర్క్ ఇన్​స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లను సర్కార్ తొలగించడంతో రోడ్డున పడ్డారు. ఏడాదిగా వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తి చేసిన వీరంతా కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్లుగా, వ్యవసా య కూలీలుగా, దుకాణాల్లో గుమాస్తాలుగా పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇరిగేషన్ లాంటి ఇతర శాఖల్లోనైనా తమకు బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.

పనులైపోయాక తొలగింపు..
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇంటింటికి తాగు నీరిందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ భగీరథ స్కీమ్​ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇం దులో భాగంగా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించడం కోసం 2015లో  662 మంది వర్క్ ఇన్ స్పెక్టర్లను, 47 మంది జూనియర్ అసిస్టెంట్లను తీసుకున్నారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్, ఇంటర్వ్యూ, రోస్టర్ పాయింట్​ను అనుసరించే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, డ్రాయింగ్‌‌‌‌ల ప్రకారం భగీరథ ట్యాంకులు, పైపులైన్‌‌‌‌ పనులు చేయించడం, రోజూ ఫీల్డ్​లో తనిఖీలు నిర్వహించడం, రికార్డులు అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేసి, ఫొటోలు తీసి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయడం, అధికారులకు సమాచారం పంపడం వర్క్ ఇన్ స్పెక్టర్ల పనిగా ఉండేది. రెండేళ్ల తర్వాత అందరి సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తామని ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు చెప్తూ వచ్చారు. రెగ్యులరైజేషన్ కోసం వివరాలు పంపాలని గత ఏడాది మార్చి 3న ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫీసు నుంచి మెమో కూడా జారీ అయ్యింది. తీరా మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాక వర్క్ ఇన్​స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లందరినీ తొలగిస్తూ నిరుడు జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు 3 నెలలుగా జీతాలివ్వడం నిలిపేశారు. దీంతో 709 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

మంత్రుల చుట్టూ పదుల సార్లు ప్రదక్షిణలు
తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతూ వర్క్ ఇన్ స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు మంత్రులందరిని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్​ను 15 సార్లు కలిశారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు, మిషన్ భగీరథ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పదేసి సార్లు కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. సీఎం దృష్టికి తీసు కెళ్తామనడమే తప్పా.. తమను విధుల్లోకి తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరిగేషన్ డిపార్ట్ మెంట్​లో నైనా తీసుకోవాలె 
కరోనా కష్టకాలంలో మా జాబ్స్ తీసేయడంతో రోడ్డున పడ్డాం.. ఈ ఎక్స్ పీరియన్స్ తో బయట వేరే జాబ్స్ దొరక్క, ఇప్పుడు ఏం చేయాలో తెల్వక అందరం ఏదో ఒక పని చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఉద్యోగాలు పోవడంతో 662 మంది వర్క్ ఇన్ స్పెక్టర్లు, 47 మంది జూనియర్ అసిస్టెంట్ల పరిస్థితి దారుణంగా మారింది. ఇరిగేషన్ శాఖలో 532 నోటిఫై చేసిన వర్క్ ఇన్ స్పెక్టర్ పోస్టుల్లోనైనా మమ్నల్ని తీసుకుని ఆదుకోవాలి.
- వై.వినయ్, మిషన్ భగీరథ వర్క్ ఇన్ స్పెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఈ ఫొటోలో టాటా ఏస్ ట్రాలీ డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తున్న వ్యక్తి పేరు బి.నాగార్జున. వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం రామారం ఇతనిది.. బీటెక్ చదివాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మిషన్ భగీరథలో వర్క్ ఇన్‌స్పెక్టర్​గా చేరాడు. ఐదేళ్లుగా పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేస్తారని అనుకుంటున్న సమయంలో ప్రభుత్వం ఉద్యోగంలో నుంచి తీసేసింది. దీంతో జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. వచ్చే జీతం ఆగిపోవడం, పెరాలసిస్​తో బాధపడుతున్న తండ్రి వైద్య ఖర్చులు భారం కావడంతో అప్పు చేసి ఓ టాటా ఏస్ ట్రాలీ కొని దాన్ని నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఆటో నడుపుతున్న ఇతని పేరు నాంపల్లి సుమన్. సొంతూరు ములుగు. ఎంటెక్ పూర్తి చేశాక 2016 ఫిబ్రవరిలో మిషన్ భగీరథలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా చేరాడు. నిరుపేద కుటుంబానికి చెందిన సుమన్​కు జాబ్ రావడంతో ఇక తమ కష్టాలు తీరాయని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అయితే ఐదేళ్ల తర్వాత జాబ్ పోయిందని కొడుకు ఇంటికి చేరడంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన సుమన్.. కుటుంబ పోషణ కోసం ప్యాసింజర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

వ్యవసాయ పనులు చేస్తున్న ఈమె పేరు నారపాటి శ్రావణి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామం. ఈమె బీటెక్ చదివారు. 2016లో భగీరథలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. అప్పట్లో ప్రెగ్నెన్సీతో ఉన్నా సైట్ మీదికి వెళ్లడం మానలేదు. ఎప్పటికైనా జాబ్ పర్మినెంట్ అవుతుందన్న ఆశతో సెలవు పెట్టకుండా డ్యూటీకి వెళ్లేవారు. పాప పుట్టాక కరోనా ఫస్ట్ వేవ్ వచ్చిన మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనూ డ్యూటీకి వెళ్లారు. ఇంత చేసినా చివరికి జాబ్ నుంచి తీసేయడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. శ్రావణి ప్రస్తుతం వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు.  

కిరాణా షాపు నిర్వహిస్తున్న  ఇతని పేరు భూపతి సందీప్. చదివింది ఎంబీఏ.. మిషన్ భగీరథ మహబూబాబాద్ గ్రిడ్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసేవాడు. ప్రభుత్వం వర్క్ ఇన్ స్పెక్టర్లతో పాటు జూనియర్ అసిస్టెంట్లను కూడా జాబ్ నుంచి తీసేయడంతో స్వయం ఉపాధిని ఎంచుకున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లిలో తన ఇంటి దగ్గరే కిరాణా షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.