బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో.. బతుకమ్మ ఆడిన వరల్డ్ బ్యూటీలు

బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో.. బతుకమ్మ ఆడిన వరల్డ్ బ్యూటీలు

వరంగల్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ప్రపంచ సుందరీమణులు వరంగల్ పట్టణానికి వచ్చారు. చారిత్రక నగరంలో ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ ఆడారు. ప్రపంచ అందగత్తెలంతా ఒక్కచోట చేరడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. బుధవారం సాయంత్రం వరంగల్ వచ్చిన వరల్డ్ బ్యూటీలకు పూలమాలలతో, డోలు- సన్నాయిలతో జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత చీరకట్టులో తిలకం దిద్దుకొని అచ్చం తెలుగు అమ్మాయిల లాగా సందడి చేశారు.

అనంతరం వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్ ను సందర్శించారు ముద్దుగుమ్మలు. వేయి స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ చరిత్ర, ప్రతిష్టతను గైడ్ లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి దీనికి సంబంధించిన చిత్రాలను సెల్ ఫోన్లలో  ఫోటోలు తీసుకున్నారు. సుందరీమణుల రాకసందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. 

ఖిలా వరంగల్ కోటలో చపాట మిర్చి, కలంకారీ దర్రీస్, చేనేత వస్త్రాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పరిశీలించారు. ఖిలా వరంగల్ కోట చరిత్రను గైడ్ లను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన  లైటింగ్ మ్యూజిక్, పేరిణి శివతాండవం, భరతనాట్యం ప్రదర్శనల తిలకించారు. కలంకారీ దర్రిస్ సుందరీమణులకు బహుకరించారు ప్రజాప్రతినిధులు. 

ఆ తర్వాత ములుగు జిల్లా రామప్ప ఆలయానికి ప్రపంచ సుందరిమణులు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర ఎస్పీ శబరిష జిల్లా అధికారులు టూరిజం శాఖ అధికారులు ప్రపంచ సుందరీమణులకు ఘన స్వాగతం పలికారు. గుస్సాడీ నృత్య ప్రదర్శన ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. రామప్ప దేవాలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.