
లివర్‌పూల్: తెలంగాణ బాక్సర్, రెండుసార్లు వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఏడాది తర్వాత ఇంటర్నేషనల్ కాంపిటీషన్‌లో అడుగుపెడుతోంది. గురువారం నుంచి జరిగే వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పారిస్ గేమ్స్ తర్వాత ఆటకు దూరమైన నిఖత్, లవ్లీనా బొర్గొహైన్ పరిమితమైన ట్రెయినింగ్‌తోనే మెగా ఈవెంట్‌కు రెడీ అయ్యారు. ఈ ఏడాది మూడు వరల్డ్ బాక్సింగ్ కప్‌లను మిస్ కావడంతో ఈ ఇద్దరూ అన్‌సీడెడ్‌గా పోటీపడుతున్నారు. దాంతో ఆరంభ రౌండ్లలో ఈ ఇద్దరికీ కఠిన పరీక్ష ఎదురుకానుంది.
2022లో 52 కేజీలు, 2023లో 50 కేజీల్లో పోటీపడ్డ నిఖత్ రెండుసార్లు వరల్డ్ టైటిల్స్ నెగ్గింది. అయితే ఇప్పుడు కొత్తగా 51 కేజీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పారిస్ ఒలింపిక్స్‌లో చైనా బాక్సర్ వు యి చేతిలో ఓడి రెండో రౌండ్‌లోనే నిష్క్రమించిన నిఖత్ ఈ టోర్నీలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇక, ఇప్పటికే మూడుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన లవ్లీనా 75 కేజీల్లో తన టైటిల్‌ను కాపాడుకోవాలని చూస్తోంది. అయితే ఈ కేటగిరీలో ఈమెకు కూడా గట్టి పోటీ ఎదురుకానుంది.
ఆసియా చాంపియన్ పూజా రాణి, జాస్మిన్ లంబోరియా (57 కేజీ), సాక్షి (54 కేజీ), నుపూర్ (80+ కేజీ) కూడా పతకం వేటలో ఉన్నారు. మెన్స్ టీమ్‌లో నిశాంత్ దేవ్, దీపక్ బోరియా, మహ్మద్ హుస్సాముద్దీన్ వేర్వేరు కారణాలతో టోర్నీ నుంచి తప్పుకున్నారు. దాంతో సుమిత్ కుండు, హర్ష్ చౌదరీ (86 కేజీ)పై ఆశలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లకు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆడిన అనుభవం ఉంది.
జాదుమణి సింగ్ (50 కేజీ), హితేశ్ గులియా (70 కేజీ), అభినాష్ జామ్వాల్ (65 కేజీ) కూడా సత్తా చాటాలని చూస్తున్నారు. ఓవరాల్‌గా 17 మంది పారిస్ ఒలింపిక్ విజేతలతో సహా 65కి పైగా దేశాల నుంచి 550 మంది బాక్సర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు.