గుయాంగ్: ఇండియా బాక్సర్ మీనాక్షి.. వరల్డ్ కప్ బాక్సింగ్ స్టేజ్–2 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్ 51 కేజీ ప్రిక్వార్టర్స్‌లో మీనాక్షి 5–0తో నటాలియా కుట్జెవెస్కా (పోలెండ్)పై ఏకపక్ష విజయం సాధించింది. 48 కేజీల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న మీనాక్షి ఒలింపిక్స్ అర్హత కోసం ఈ టోర్నీలో 51 కేజీల్లో బరిలోకి దిగింది.
మెన్స్ 65 కేజీల్లో అభినాష్ జమ్‌వాల్ నిరాశపర్చాడు. ప్రిక్వార్టర్స్‌లో మిర్జోఖిద్ ఇమామ్ నజరోవ్ (కిర్గిస్తాన్) 5–0తో జమ్‌వాల్‌ను ఓడించాడు. ఇప్పటికే నిఖిల్ (55 కేజీలు), దీపక్ (70 కేజీలు), ప్రాచీ (57 కేజీలు), సనేహ్ (65 కేజీలు) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. జ్యోతి (48 కేజీలు), జుగ్నూ (85 కేజీలు) సెమీస్ చేరి దేశానికి పతకాలను ఖాయం చేశారు.
