సఫారీల కల సాకారమయ్యేనా!

సఫారీల కల సాకారమయ్యేనా!

అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న సామెత సౌతాఫ్రికా టీమ్‌‌కు సరిగ్గా సరిపోతుంది. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌‌లో దురదృష్టం ఆ జట్టు చెంతే ఉంటుంది. అద్భుతమైన బ్యాట్స్‌‌మెన్‌‌, పదునైన బౌలర్లు, మెరికల్లాంటి ఆల్‌‌రౌండర్లు, సమర్థవంతమైన నాయకులతో ఏడుసార్లు వరల్డ్‌‌కప్‌‌ వేటకు వచ్చిన సఫారీ టీమ్‌‌కు చివరకు ఏడుపే మిగిలింది. చాంపియన్‌‌ ఆటతీరుతో సెమీఫైనల్‌‌కు దూసుకురావడం.. అక్కడితోనే ఆగిపోయి కన్నీటితో నిష్క్రమించి అభిమానులూ కంటతడి పెట్టేలా చేయడం ఆ జట్టుకు అలవాటు. ఏడు టోర్నీల్లో నాలుగుసార్లు సెమీస్‌‌కు వస్తే ఒక్కసారి కూడా ఫైనల్‌‌ చేరుకోలేకపోయింది. దాంతో, సఫారీలపై ‘చోకర్స్‌‌’ అన్న ముద్ర పడింది. ఎప్పట్లాగే ఈ సారి కూడా బలమైన టీమ్‌‌తో సఫారీలు వరల్డ్‌‌కప్‌‌ బరిలో నిలిచారు. మరి, ఈ సారైనా వారి కల నెరవేరుతుందో లేదో చూడాలి.

వెలుగు క్రీడా విభాగం : వరల్డ్‌‌ కప్‌‌ పేరు చేతితే మిగతా దేశాల అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైతే సౌతాఫ్రికా ఫ్యాన్స్‌‌ను చేదు జ్ఞాపకాలు వెంటాడుతాయి. మేటి జట్లకు ఎప్పుడూ దీటుగా టైటిల్‌‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగే దక్షిణాఫ్రికా టీమ్‌‌కు వరల్డ్‌‌కప్‌‌ అందని ద్రాక్షగానే మిగిలింది. అద్భుతంగా ఆడుతూ నాకౌట్‌‌ చేరుకునే ఆ జట్టుకు కీలక టైమ్‌‌లో ఏదీ కలిసిరాదు. 1992, 1999, 2007తో పాటు గత వరల్డ్‌‌కప్‌‌లో ఆ జట్టు సెమీస్‌‌లోనే ఓడిపోయింది. అయితే, ఈ సారి మాత్రం ఎలాగైనా కప్పు కొట్టాలన్న డుప్లెసిస్‌‌ కెప్టెన్సీలోని సౌతాఫ్రికా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. నాకౌట్‌‌లో నగుబాటుకు గురవుతారన్న ముద్రను చెరిపేసుకొని.. నిర్భయమైన క్రికెట్‌‌ ఆడాలని డిసైడైంది. కెప్టెన్‌‌ డుప్లెసిస్‌‌ సహా గత టోర్నీలో ఆడిన ఏడుగురు ఆటగాళ్లతో పాటు కగిసో రబాడ వంటి ప్రతిభావంతులైన కొత్త ముఖాలతో ఇంగ్లండ్‌‌లో లడాయి చేసేందుకు
రెడీ అయింది.

బలాలు

కొంత కాలం నుంచి సౌతాఫ్రికా వన్డేల్లో నిలకడగా రాణిస్తోంది. సీనియర్లు, యువ ప్లేయర్లతో జట్టు సమతూకంలో కనిపిస్తోంది. బ్యాటింగ్‌‌లో కెప్టెన్‌‌ డుప్లెసిస్‌‌, ఓపెనర్‌‌ క్వింటన్‌‌ డికాక్‌‌ సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్నారు. ఐపీఎల్‌‌లో ఇద్దరూ అదరగొట్టారు. ముంబై తరఫున డికాక్‌‌ ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌తో శుభారంభాలు ఇస్తే.. చెన్నైకి ఆడిన డుప్లెసిస్‌‌ ఒత్తిడిలో మెరుగ్గా రాణించాడు. ఇంగ్లండ్‌‌లోనూ ఇద్దరూ ఇదే జోరు చూపితే జట్టుకు తిరుగుండదు. ఆమ్లా రూపంలో అత్యంత సీనియర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ టాపార్డర్‌‌లో ఉన్నాడు. మిడిలార్డర్‌‌లో జేపీ డుమినిపై జట్టు భారం ఉంచింది. చివర్లో డేవిడ్‌‌ మిల్లర్‌‌, ఆల్‌‌రౌండర్‌‌ క్రిస్‌‌ మోరిస్‌‌ నుంచి మెరుపులు ఆశిస్తోంది. ఆల్‌‌రౌండర్లు ప్రిటోరియస్‌‌, ఫెలుక్వాయో అదనపు బలం. ఇక బౌలింగ్‌‌లో సౌతాఫ్రికాకు తిరుగేలేదు. వెటరన్‌‌ పేసర్‌‌ డేల్‌‌ స్టెయిన్‌‌, కగిసో రబాడ, లుంగి ఎంగిడి పేస్‌‌ త్రయం టోర్నీలోనే అత్యంత ప్రమాదకరంగా ఉంది. అలాగే, స్పిన్నర్‌‌ ఇమ్రాన్‌‌ తాహిర్‌‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. నలభైలోకి వచ్చినా అతను నంబర్‌‌ వన్‌‌ స్పిన్‌‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌‌మెన్‌‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఐపీఎల్‌‌లో అదగొట్టిన రబాడ, తాహిర్‌‌ ఇంగ్లండ్‌‌లో సఫారీలకు అత్యంత కీలకం.

బలహీనతలు

బ్యాటింగ్‌‌లో ఎప్పుడూ బలంగా ఉండే సౌతాఫ్రికా కాస్త బలహీనంగా మారింది. మాజీ కెప్టెన్‌‌  డివిలియర్స్‌‌ లేని లేటు కొట్టొస్తోంది. డుప్లెసిస్‌‌, డికాక్‌‌ తప్పితే మరే బ్యాట్స్‌‌మన్‌‌ ఫామ్‌‌లో లేడు. వీరిద్దరూ విఫలమైతే బాధ్యత తీసుకొనే వారు కనిపించడం లేదు. ముఖ్యంగా టీమ్‌‌లో సీనియర్‌‌ మోస్ట్‌‌ ప్లేయర్‌‌ ఆమ్లా చాలా కాలంగా ఫామ్‌‌ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఒకదశలో అతనిపై వేటు వేయడం పక్కా అనిపించినా.. అనుభవం కారణంగా ఇంగ్లండ్‌‌ టిక్కెట్‌‌ దక్కించుకున్నాడు. బ్యాకప్‌‌ ఓపెనర్‌‌ మార్‌‌క్రమ్‌‌ కొత్త కుర్రాడు. అతడిపై నమ్మకం ఉంచలేని పరిస్థితి. డుమిని, మిల్లర్‌‌ నాణ్యమైన ఆటగాళ్లే అయినా ఇద్దరూ ఫామ్​లో లేరు. పైగా గాయాల సమస్య సౌతాఫ్రికాను వెంటాడుతోంది. సఫారీ అస్త్రాలుగా భావిస్తున్న ముగ్గురు పేసర్లు రబాడ, స్టెయిన్‌‌, ఎంగిడి గాయాల నుంచి కోలుకొని వచ్చారు.  వీళ్లు ఫిట్‌‌నెస్‌‌కు కాపాడుకుంటేనే టీమ్​ ముందుకెళ్లగలదు.

అంచనా: పేరుకు తగ్గట్టు ఆడుతూ, తప్పిదాలు చేయకుండా, ఒత్తిడికి తలొగ్గకుంటే సౌతాఫ్రికా కప్‌‌ నెగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే, ఇంగ్లండ్‌‌, ఇండియా, ఆస్ట్రేలియా వంటి మేటి జట్లను దాటడం అంటే మామూలు విషయం కాదు. ఆటతో పాటు కాస్త అదృష్టం కూడా ఆ టీమ్‌‌కు అవసరం. అంతకంటే ముందు సెమీస్‌‌కు చేరుకోవాలంటే లీగ్‌‌ దశలో ఆ జట్టు కనీసం ఐదు మ్యాచ్‌‌ల్లో నెగ్గాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ జట్టు టార్గెట్‌‌ కూడా అదే. ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు.

జట్టు

డుప్లెసిస్‌‌ (కెప్టెన్‌‌), ఐడెన్‌‌ మార్‌‌క్రమ్‌‌, క్వింటన్‌‌ డికాక్‌‌ (కీపర్), హషీమ్‌‌ ఆమ్లా, వాండర్‌‌ డుసేన్‌‌, డేవిడ్‌‌ మిల్లర్‌‌, క్రిస్‌‌ మోరిస్‌‌, ఫెలుక్వాయో, జేపీ డుమిని, ప్రిటోరియస్‌‌, డేల్‌‌ స్టెయిన్‌‌, కగిసో రబాడ, లుంగి ఎంగిడి, ఇమ్రాన్‌‌ తాహిర్‌‌, తబ్రియాజ్‌‌ షంసీ.