- హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని లోరియల్ ప్రకటన
- ఈ ఏడాది నవంబర్‌లోనే ప్రారంభించనున్నట్టు వెల్లడి
- ప్రపంచంలోనే తొలి ‘స్విస్ మాల్’ కూడా హైదరాబాద్‌కే..
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ) ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు లోరియల్ సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లోనే ప్రారంభించనుంది. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులతో బ్యూటీ–టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది.
డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని హియెరోనిమస్ తెలిపారు. దీంతో గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ కార్యకలాపాలకు హైదరాబాద్ ప్రాముఖ్యత మరింత పెరగనుంది. నవంబర్‌లో జీసీసీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబును లోరియల్ ఆహ్వానించింది. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. లోరియల్ జీసీసీని హైదరాబాద్‌కు తీసుకురావాలన్న ఆలోచనపై సీఎం ప్రత్యేక ఆసక్తి చూపారని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.
ఇప్పటికే మారియెట్, వ్యాన్ గార్డ్, నెట్ ఫ్లిక్స్, మెక్ డోనాల్డ్స్, హినెకెన్, జాగర్, కోస్ట్కో వంటి గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయన్నారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ గురించి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా వివరించింది. జీసీసీతో పాటు మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని లోరియల్‌ను కోరారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమల ఎకోసిస్టమ్‌ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తయారీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హియెరోనిమస్ తెలిపారు.
త్వరలో రాష్ట్రానికి స్విస్ బృందం..
దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డితో స్విట్జర్లాండ్‌లోని వాడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్ సమావేశమయ్యారు. భారత్–స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం తెలంగాణ రైజింగ్–2047 విజన్‌ను స్విస్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్ మాల్’ ఏర్పాటు చేయాలనే ఆలోచనను సీఎం ప్రతిపాదించగా.. స్విస్ బృందం వెంటనే సానుకూలంగా స్పందించింది.
ఇద్దరు సీఎంలు ఫుట్‌బాల్ ఆటగాళ్లే కావడంతో, క్రీడల రంగంలో భాగస్వామ్యంపై కూడా విస్తృతంగా చర్చించారు. క్రీడా శిక్షణ, మౌలిక వసతుల అభివృద్ధిలో కలిసి పనిచేయవచ్చని అభిప్రాయపడ్డారు. సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ రంగాల్లో.. ముఖ్యంగా హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, క్రీడల విభాగాల్లో పరస్పర సహకారానికి అవకాశాలపై లీడర్లు అభిప్రాయాలు పంచుకున్నారు.
రిటైల్, లైఫ్ సైన్సెస్‌లో రంగాల్లో అవకాశాలపై చర్చించారు. మహిళా సాధికారతకు సంబంధించి స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలపై స్విస్ బృందం ఆసక్తి కనబరిచింది. సహకార అంశాలు పరిశీలించేందుకు త్వరలోనే స్విట్జర్లాండ్ బృందం హైదరాబాద్‌కు వస్తుందని వాడ్ రాష్ట్ర పరిశ్రమలు, ఆర్థిక శాఖ మంత్రి ఇసబెల్ మోరెట్ తెలిపారు.
ఏబీ ఇన్‌బెవ్ యూనిట్ విస్తరణ..
ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ఏబీ ఇన్‌బెవ్.. తెలంగాణలో ఇప్పటికే ఉన్న తమ తయారీ యూనిట్‌ను విస్తరించేందుకు భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో ఏబీ ఇన్‌బెవ్ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్‌బెవ్.. సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడి లభించినందుకు సీఎం హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణతో బ్లైజ్ కంపెనీ ఒప్పందం..
రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సంస్థ డేటా సెంటర్ అర్టిఫిషియల్ కంప్యూటింగ్‌కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్‌వేర్, ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. సదస్సులో సీఎం రేవంత్‌తో బ్లైజ్ కో ఫౌండర్ సీఈవో దినాకర్ మునగాలా సమావేశమయ్యారు. చర్చల అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీంతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు వేగవంతమవుతాయి. ఇప్పటికే బ్లైజ్ సంస్థ హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. తమ ఆర్ అండ్ డీ సెంటర్‌ను విస్తరించే పెట్టుబడులు, ప్రణాళికలపైనా చర్చలు జరిగాయి.
హెల్త్‌కేర్ డయాగ్నోస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి రంగాల్లో ఏఐ ద్వారా పరిష్కారాలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దడం అత్యంత కీలకమని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్, హార్డ్‌వేర్, ఆటోమేషన్ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. దేశంలోనే టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ వృద్ధి సాధిస్తోందన్నారు.
టాస్క్, స్కిల్ వర్సిటీ.. గొప్ప ఆలోచనలు
యువతకు ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో టాస్క్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించిందని.. ఇది చాలా గొప్ప ఆలోచన అని సిస్కో గ్లోబల్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గై డీడ్రిచ్ ప్రశంసించారు. సీఎం నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందంతో సిస్కో సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో సిస్కో చేపట్టబోయే పనులపై చర్చించారు.
సిస్కో సీనియర్ అధికారి గై డీడ్రిచ్ మాట్లాడుతూ.. 2025 మార్చిలో టాస్క్, స్కిల్ యూనివర్సిటీతో కుదిరిన ఒప్పందాల తర్వాత ఆశించిన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా యువతకు కంప్యూటర్ నెట్‌వర్క్ లు, సైబర్ సెక్యూరిటీ, ఆధునిక టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వనున్నారు.
