క్లైమేట్ చేంజ్ తో తీవ్ర నష్టం..వడగాడ్పులకు 15 వేల మంది బలి

క్లైమేట్ చేంజ్ తో  తీవ్ర నష్టం..వడగాడ్పులకు 15 వేల మంది బలి

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా యూరప్​తో పాటు ఇండియా, చైనా వంటి అనేక దేశాల్లో గతేడాది వాతావరణ మార్పు(క్లైమేట్ చేంజ్) కారణంగా తీవ్ర నష్టం జరిగిందని వరల్డ్ మెటియోరాలజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది. 2022లో ఒక్క హీట్ వేవ్స్ (వడగాడ్పులు) వల్లనే యూరప్​లో ఏకంగా 15,700 మంది మృత్యువాతపడ్డారని తెలిపింది. ఇండియాలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో వరదల వల్ల 700 మంది, పిడుగుల వల్ల 900 మంది బలైపోయారని పేర్కొంది. ఈ మేరకు డబ్ల్యూఎంవో ‘స్టేట్ ఆఫ్​ ది గ్లోబల్ క్లైమేట్ 2022’ రిపోర్ట్ ను తాజాగా విడుదల చేసింది. పోయిన ఏడాది కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌజ్ వాయువులు రికార్డ్ స్థాయిలో పెరగడంతో అనేక ప్రాంతాల్లో కరువులు, వరదలు, వడగాడ్పులు కూడా పెరిగాయని తెలిపింది.  దాదాపు ప్రతి ఖండంలోనూ కరువులు, వరదలు, హీట్ వేవ్స్​తో వందల కోట్ల డాలర్ల నష్టం జరిగిందని పేర్కొంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు గత 8 ఏండ్లలోనే అత్యధికంగా (1.15 డిగ్రీ సెల్సియస్) పెరిగాయని తెలిపింది. అంటార్కిటికాలోని మంచుతోపాటు యూరప్​లోని కొన్ని గ్లేసియర్లు కూడా రికార్డ్ స్థాయిలో కరిగాయని వివరించింది.   

క్లైమేట్ చేంజ్​తో వరదలు, కార్చిచ్చులు 

‘‘పోయిన ఏడాది ఇండియాలో రుతుపవనాలు ముందే వచ్చాయి. ఉపసంహరణ ఆలస్యంగా జరిగింది. అంతకుముందు ఎండలు మండిపోయాయి. పాకిస్తాన్​లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. దీంతో ఆహార ధాన్యాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఉత్తరాఖండ్​లో కార్చిచ్చులు చెలరేగాయి. దీంతో గోధుమలు, బియ్యం ఎగుమతులను నిషేధించాల్సి వచ్చింది. వానాకాలం సీజన్ లో ఇండియాలోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి” అని రిపోర్ట్ పేర్కొంది.