
సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ అల్ అహ్సా ప్రాంతంలో ప్రపంచంలోనే తొలి ఏఐ డాక్టర్ క్లినిక్ ప్రారంభమైంది. చైనాకు చెందిన వైద్య సాంకేతిక సంస్థ సైన్యీ ఏఐ, సౌదీ అరేబీయాకు చెందిన అల్మూసా హెల్త్ గ్రూప్ సంయుక్తంగా ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ క్లినిక్ లోని ఏఐ డాక్టర్ పేరు డాక్టర్ హువా. క్లినిక్కు వచ్చిన రోగులు ముందుగా తమ వ్యాధి లక్షణాలను ఒక ట్యాబ్ ద్వారా డాక్టర్ హువాకు వివరిస్తారు. ఏఐ డాక్టర్ మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది. మానవ సహాయకుల సహాయంతో రోగి శరీర ఉష్ణోగ్రత, ఇతర డేటా, చిత్రాలను సేకరించి విశ్లేషిస్తుంది.
సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత డాక్టర్ హువా ఒక చికిత్సా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. అయితే, ఈ ఏఈ రూపొందించిన ప్రణాళికను మానవ వైద్యుడు క్షుణ్ణంగా సమీక్షించి, ఆమోదించిన తర్వాతే రోగికి చికిత్స ప్రారంభిస్తారు. మానవ వైద్యులు భద్రతా పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మావన వైద్యులు తక్షణమే అందుబాటులో ఉంటారు. ఏఐ డాక్టర్ ప్రస్తుతం శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు( ఉబ్బసం, గొంతు నొప్పి వంటి సుమారు 30 రకాల వ్యాధులు) కన్సల్టేషన్ అందిస్తోంది. సిన్యి ఏఐ భవిష్యత్తులో ఏఐ డాక్టర్ డేటా బేస్ ను విస్తరించి, శ్వాసకోశ, జీర్ణకోశ, చర్మ సంబంధిత వ్యాధులతో కలిపి మొత్తం 50 రకాల వ్యాధులకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఈ ఏఐ వ్యవస్థ ప్రస్తుతం అరబిక్, చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడుతుంది. ఏఐ డాక్టర్ మానవ వైద్యులకు ప్రత్యామ్నాయం కాకుండా వారికి సహాయపడే ఒక సాధనంగా పనిచేస్తుంది. తద్వారా వారు మరింత క్లిష్టమైన కేసులపై దృష్టి పెట్టడానికి అవకాశం లభిస్తుంది. ఇది ప్రస్తుతం ఒక పైలట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా సేకరించిన రోగ నిర్ధారణ డేటా, పనితీరు నివేదికలను సౌదీ అధికారులు, నియంత్రణ సంస్థలకు అందజేస్తారు.