WPL 2024: జీతం కట్..! కారు అద్దాలు పగలగొట్టిన ఆర్‌సీబీ మహిళా క్రికెటర్  

WPL 2024:  జీతం కట్..! కారు అద్దాలు పగలగొట్టిన ఆర్‌సీబీ మహిళా క్రికెటర్  

యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళలు అదరగొట్టారు. ప్రత్యర్థి బౌలర్లను తునాతునకలు చేస్తూ తమ బ్యాటింగ్ లైనప్ ఎంత బలమైనదో చాటి చెప్పారు. టాస్ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ క్రికెటర్ ఎల్లీస్‌ పెర్రీ కొట్టిన ఓ సిక్సర్‌ దెబ్బకు కారు అద్దాలు పగిలాయి. 

దీప్తి శర్మ వేసిన 19వ ఓవర్ చివరి బంతిని పెర్రీ లాంగ్-ఆన్ మీదుగా సిక్సర్‌గా మలిచింది. దాదాపు 80 మీటర్ల దూరం వెళ్లిన బంతి నేరుగా వెళ్లి కారు అద్దాన్ని తగిలింది. దీంతో అద్దం టప్ మని పగిలిపోయింది. ఈ ఘటనతో పెర్రీ కూడా ఆశ్చర్యపోయింది. అయ్యో..! నా వల్ల కారు అద్దం పగిలిపోయిందే అంటూ తలపై చేతులు వేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పగిలిన అద్దానికి నష్టపరిహారం పెర్రీ జీతం నుంచి కట్ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మంధాన ఫోర్లు, పెర్రీ సిక్సర్లు

ఈ మ్యాచ్‌ లో ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన (80; 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేయగా.. ఎల్లీస్‌ పెర్రీ (58; 37 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించింది. దీంతో ఆర్‌సీబీ.. యూపీ ఎదుట 199 పరుగుల భారీ స్కోర్ నిర్ధేశించింది.