WPL 2024: చితక్కొట్టిన స్మృతి మంధాన.. యూపీ ఎదుట భారీ లక్ష్యం

WPL 2024: చితక్కొట్టిన స్మృతి మంధాన.. యూపీ ఎదుట భారీ లక్ష్యం

చిన్నస్వామి వేదికగా యూపీ వారియర్స్‌తో జరుగుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళలు దుమ్మురేపారు. యూపీ బౌలర్లను తునాతునకలు చేస్తూ పరుగుల వరద పారించారు. ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన (80; 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేయగా.. ఎల్లీస్‌ పెర్రీ (58; 37 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించింది. దీంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగుల భారీ స్కోరు చేసింది.

మంచి ఆరంభం

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌‌కు దిగిన ఆర్‌సీబీకి మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు మంధాన (80; 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), సబ్బినేని మేఘన (21 బంతుల్లో 28, 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఆదినుంచే ధాటిగా ఆడటంతో ఆర్‌సీబీ పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోయి 57 పరుగులు చేసింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో మేఘన వికెట్‌ పారేసుకుంది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఎల్లీస్‌ పెర్రీతో జతకలిసిన మంధాన.. తన దూకుడు అలానే కొనసాగించింది. వీరిద్దరూ రెండో వికెట్‌ కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

చివరలో మంధాన వెనుదిరిగినా.. ఎల్లీస్‌ పెర్రీ (58; 37 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రిచా ఘోష్(21; 10 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) మెరుపులు మెరిపించారు. ప్రత్యర్థి జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు వీరు ఏమాత్రం లెక్కచేయలేదు. బౌండరీల వర్షం కురిపించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్(4 ఓవర్లలో 22 పరుగులు) ఒక్కటే పర్వాలేదనిపించింది.