
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో లైవ్
వడోదరా: మూడో అంచె విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు రంగం సిద్ధమైంది. నేడు డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌తో లీగ్‌కు తెరలేవనుంది. గ్లోబల్ స్టార్లతో లీగ్‌కు ఎనలేని ఆదరణ వచ్చినా.. ప్రస్తుతం ఇండియా డొమెస్టిక్ ప్లేయర్లపైనే ఎక్కువగా ఫోకస్ ఉంది. దీంతో కొత్తగా జట్లలోకి వచ్చిన యంగ్‌స్టర్స్ సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు. తొలి రెండు సీజన్లలో రాణించిన శ్రేయాంక పాటిల్, సైకా ఇషాకి ఇప్పటికే టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. విదేశీ స్టార్లు అలీసా హీలీ, సోఫీ మొలినుక్స్, కేట్ క్రాస్ గాయాలతో ఈ సీజన్‌కు దూరం కావడం కాస్త ఇబ్బందిగా మారింది. అయితే డొమెస్టిక్‌లో బాగా అనుభవం ఉన్న ప్లేయర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.
5 జట్లు.. 22 మ్యాచ్‌లు.. 2 కొత్త వేదికలు..
గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా ఐదు జట్లతోనే లీగ్‌ను నిర్వహిస్తున్నారు. మార్చి 15 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే లీగ్‌ను మరిన్ని ప్రదేశాలకు విస్తరించాలనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా వడోదరా, లక్నోలను వేదికలుగా చేర్చింది. ఫార్మాట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రతి జట్టు హోమ్ అండ్ అవే పద్ధతిలో ఇతర జట్లతో రెండుసార్లు తలపడుతుంది. లీగ్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన జట్టు డైరెక్ట్‌గా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో నెగ్గిన టీమ్ టైటిల్ ఫైట్‌కు వెళ్తుంది. లీగ్ దశలో ఆడే తొలి ఆరు మ్యాచ్‌లకు వడోదరా ఆతిథ్యమిస్తుంది. తర్వాత ఎనిమిది మ్యాచ్‌లు బెంగళూరులో, లక్నోలో నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. చివరి నాలుగు మ్యాచ్‌లు ముంబైలోని సీసీఐలో ఆడనున్నారు.
ఆర్‌సీబీ టైటిల్ నిలబెట్టుకునేనా?
ఈసారి కూడా డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే కీలక ప్లేయర్లు గాయాలబారిన పడటంతో ఆర్‌సీబీ టైటిల్ నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. సోఫీ డివైన్, మొనులిక్స్, కేట్ క్రాస్, ఆశా శోభన గాయాలతో టోర్నీకి అందుబాటులో లేరు. శోభన ప్లేస్‌లో నుజుహత్ పర్వీన్ టీమ్‌లోకి వచ్చింది. ఆల్‌రౌండర్ ఎలైస్ పెర్రీ, శ్రేయాంక పాటిల్ గాయాల నుంచి కోలుకోవడం ఆర్‌సీబీకి శుభపరిణామం. ఇక డబ్ల్యూపీఎల్‌లో రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి టైటిల్‌పై కన్నేసింది. షెఫాలీ వర్మ, మెగ్ లానింగ్, రొడ్రిగ్స్, సదర్లాండ్, మారిజానె కాప్ బ్యాట్‌తో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.
శిఖా పాండే, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధూ, జొనాసెన్, రాధా యాదవ్‌తో కూడిన బలమైన బౌలింగ్ లైనప్ ఉండటం అనుకూలాంశం. తొలి సీజన్ విన్నర్ ముంబై ఇండియన్స్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, హీలీ మాథ్యూస్, యాస్తికా భాటియా, సివర్ బ్రంట్, అమెలియా కెర్ర్ బ్యాట్లు ఝుళిపించేందుకు సిద్ధమవుతున్నారు. పూజా వస్త్రాకర్ ప్లేస్‌లో పారునిక సిసోడియాను ముంబై తీసుకుంది. ఇక గుజరాత్, యూపీ వారియర్స్ కొత్త కెప్టెన్లుగా దీప్తి శర్మ, ఆష్లే గాడ్నెర్ తమ మార్క్ చూపెట్టేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. దియోంద్ర డాటిన్, సిమ్రాన్ షేక్, డానియెల్లి గిబ్బసన్, కశ్వీ గౌతమ్ కూడా తమ ఫ్రాంచైజీల తరఫున దీటుగా ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మ్యాచ్ మధ్యలో ఓపెనింగ్ సెర్మనీ
ఈసారి కూడా ఓపెనింగ్ సెర్మనీ కోసం డబ్ల్యూపీఎల్ నిర్వాహకులు మంచి ఏర్పాట్లే చేశారు. మ్యాచ్ మధ్యలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో పాటు సింగర్ మధుబంటి బాగ్చి ఇందులో పాల్గొంటారు. థీమ్ షెర్నియా పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. క్రీడల్లో మహిళల బలం, ధైర్యానికి ప్రతీకగా ఇది నిలవనుంది.