నవీ ముంబై: డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై ఇండియన్స్ గాడిలో పడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (74 నాటౌట్), సివర్ బ్రంట్ (70) హాఫ్ సెంచరీలు సాధించడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 50 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 195/4 స్కోరు చేసింది. రెండో ఓవర్‌లోనే అమెలియా కెర్ర్ (0) డకౌట్ కాగా, కమళిని (16)తో కలిసి బ్రంట్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. రెండో వికెట్‌కు 49 రన్స్ జోడించి కమళిని వెనుదిరిగింది. 51/2 వద్ద వచ్చిన హర్మన్‌ప్రీత్ ఢిల్లీ బౌలింగ్‌పై విరుచుకుపడింది.
గ్రౌండ్ నలువైపులా భారీ షాట్లు కొట్టింది. రెండో ఎండ్‌లో బ్రంట్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు వేగంగా ముందుకెళ్లింది. ఈ క్రమంలో 32 బాల్స్‌లో బ్రంట్, 34 బాల్స్‌లో హర్మన్ హాఫ్ సెంచరీలు సాధించారు. మూడో వికెట్‌కు 66 రన్స్ జత చేసి బ్రంట్ ఔటైనా హర్మన్ చివరి వరకు క్రీజులో నిలిచింది. నికోలా కేరి (21) వేగంగా ఆడి నాలుగో వికెట్‌కు 53 రన్స్ జోడించింది. నందిని శర్మ 2 వికెట్లు తీసింది. ఛేజింగ్‌లో ఢిల్లీ 19 ఓవర్లలో 145 రన్స్‌కే ఆలౌటైంది. చినెల్లీ హెన్రీ (56) టాప్ స్కోరర్. ముంబై బౌలర్లు నికోలా కేరి (3/37), అమెలియా కెర్ర్ (3/24), బ్రంట్ (2/29) ముప్పేటా చేసిన దాడిలో ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. నికీ ప్రసాద్ (12), స్నేహ్ రాణా (11), లీజెల్లి లీ (10), మారిజానె కాప్ (10), శ్రీచరణి (10 నాటౌట్)తో సహా అందరూ విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌లో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హర్మన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
