న్యూఢిల్లీ: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష.. బజ్‌రంగ్ పునియా, వినేష్ ఫొగట్, సాక్షి మాలిక్ తదితర ఇండియా స్టార్ రెజ్లర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ విషయంలో తమను సంప్రదించకుండా మరోసారి రోడ్డెక్కి ఆందోళన చేయడం సరికాదన్నారు. ఇలా రోడెక్కిన రెజ్లర్లు క్రమశిక్షణ తప్పారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘లైంగిక ఆరోపణల ఫిర్యాదుల కోసం ఐఓఏలో ఓ కమిటీ, అథ్లెట్ల కమిషన్ ఉంది. రెజ్లర్లు మరోసారి రోడ్డెక్కే బదులు మమ్మల్ని సంప్రదిస్తే బాగుండేది.
ఈ విషయంలో రెజ్లర్లు కొంచెం క్రమశిక్షణ చూపెట్టాల్సింది. కానీ, వాళ్లు ఐఓఏ వద్దకు రాకుండా నేరుగా రోడ్డెక్కారు. ఇది ఆటకు మంచిది కాదు’ అని గురువారం ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌లో పాల్గొన్న తర్వాత ఉష అభిప్రాయపడ్డారు. రెజ్లర్లు ధర్నాలో కూర్చోవడమే కాకుండా రాజకీయ పార్టీల నాయకులనూ ఆహ్వానించడం తనను నిరుత్సాహానికి గురి చేసిందన్నారు. ఇక రెజ్లర్ల తీరుతో దేశ ప్రతిష్ఠ దిగజారేలా ఉందని ఉందని ఐఓఏ జాయింట్ సెక్రటరీ, తాత్కాలిక సీఈవో కల్యాణ్ చౌబే అన్నారు. అయితే, పీటీ ఉష కామెంట్లు తనను షాక్ కు గురి చేశాయని స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పునియా చెప్పాడు. ఆమె నుంచి ఇంత కఠినమైన స్పందనను ఊహించలేదన్నాడు. ‘ఆమె స్వయంగా అథ్లెట్. పైగా మహిళ. తను మాకు సపోర్ట్ ఇస్తారని అనుకున్నాం.
కానీ, ఇలాంటి కఠినమైన రియాక్షన్‌ను మేం ఎక్స్‌పెక్ట్ చేయలేదు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) రోజువారీ వ్యవహారాలను నిర్వహించడానికి, ఎన్నికలను నిర్వహించడానికి ఐఓఏ ముగ్గురు సభ్యులతో తాత్కాలిక కమిటీని నియమించింది. కాగా, రెజ్లర్లువేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.