రెజ్లర్ల ఆందోళన..కేంద్రం తీరుపై మండిపాటు

రెజ్లర్ల ఆందోళన..కేంద్రం  తీరుపై మండిపాటు

భారత దేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించిన రెజ్లర్లు న్యాయం కోసం రోడ్డెక్కారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ధర్నాకు దిగారు.  ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకునే వరకు ఇంటికెళ్లేది లేదంటూ  పుత్ పాత్ లపైనే పడుకుంటున్నారు. 

న్యాయం కోసం పోరాటం..

తమను లైంగికంగా వేధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు మరోసారి ధర్నాకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో న్యాయం కోసం పోరాడుతున్నారు.  ఈ విషయంలో ప్రభుత్వ  తీరుపై మండిపడుతున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను  పదవి నుంచి తొలగించాలని రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో హామీ..

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఆరోపణలు చేస్తూ గతంలోనూ రెజ్లర్లు ధర్నా చేశారు. దీనిపై అప్పట్లో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తామని.. బాధితులకు న్యాయం చేస్తామని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ కూడా ఇచ్చారు. ఈ ఆరోపణలపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో రెజ్లర్లు శాంతించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రెజ్లర్లు మరోసారి ధర్నాకు దిగారు. 

ప్రభుత్వ తీరుపై విమర్శలు..

బ్రిజ్ భూషణ్ విషయంలో ప్రభుత్వ ప్యానెల్ రిపోర్టును బయపెట్టాలని  రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. మహిళా రెజ్లర్ల నుంచి తీసుకున్న ప్యానెల్ రిపోర్టును వెల్లడించాలన్నారు. బ్రిజ్ భూషణ్పై ఫిర్యాదు చేసిన వారిలో ఒక మైనర్ కూడా ఉందని..ఆమె పేరు బయటకు రాకూడదన్నారు. బాధితులే స్వయంగా బయటికొచ్చి ఆరోపణలు చేసినా కేంద్రం చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరు చికాకు తెప్పిస్తోందని రెజ్లర్ సాక్షి మాలిక్ అసహనం వ్యక్తం చేసింది.

పోరాటం ఆగదు..

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్  చేయాలని..అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామని  రెజ్లర్ భజరంగ్ పూనియా తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.