నన్ను తప్పించేందుకు పెద్ద కుట్ర చేశారు

నన్ను తప్పించేందుకు  పెద్ద కుట్ర చేశారు


ముంబై: ఇండియా విమెన్స్ క్రికెట్‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌ కోచ్‌‌‌‌ పదవి నుంచి తప్పించేందుకు పెద్ద కుట్ర జరిగిందని మాజీ క్రికెటర్‌‌‌‌ డబ్ల్యూవీ రామన్‌‌‌‌ సంచలన ఆరోపణలు చేశాడు. తన ప్రతిష్టను దెబ్బ తీసేలా విష ప్రచారం చేశారని, దీనిని ఆపాలని కోరాడు. కోచ్‌‌‌‌గా తన పనితీరు బాగాలేదని కాకుండా, ఇతర కారణాల వల్లే  తన అప్లికేషన్‌‌‌‌ను రిజెక్ట్‌‌‌‌ చేశారని వాపోయాడు. ఈ మేరకు రామన్‌‌‌‌..  బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ గంగూలీ, నేషనల్ క్రికెట్‌‌‌‌ అకాడమీ (ఎన్‌‌‌‌సీఏ) హెడ్‌‌‌‌ రాహుల్ ద్రవిడ్‌‌‌‌కు రాసిన లెటర్​లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా రామన్‌‌‌‌కు ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ ఇవ్వని క్రికెట్‌‌‌‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)... రమేశ్ ​పొవార్​ను ఎంపిక చేసింది.  సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్‌‌‌‌లో టీమ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ బాగా లేదన్న కారణంతో తనపై  వేటు పడిందని బయటకు చెబుతున్నా... దీని వెనుక కుట్ర కోణం దాగుందని రామన్‌‌‌‌ వ్యాఖ్యానించాడు. దీంతో విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో అంతా సవ్యంగా సాగడం లేదని అర్థమవుతోంది.  ‘నా పని తీరు గురించి, వర్క్ ఎథిక్‌‌‌‌ గురించి మీకు భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయని నేను భావిస్తున్నా. ఆ అభిప్రాయాలను బీసీసీఐ అధికారులకు తెలియడం వల్ల నా అభ్యర్థిత్వంపై  ఏమైనా ప్రభావం చూపించాయా  లేదా అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు. నాపై కుట్ర పూరిత ప్రచారం జరిగింది. దీన్ని పూర్తిగా ఆపేయడమే ఇప్పుడు ముఖ్యం. ఈ విషయంలో బోర్డు ఆఫీస్‌‌‌‌ బేరర్లు వివరణ కోరితే ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని మాజీ కోచ్‌‌‌‌ పేర్కొన్నాడు. 

నా అసమర్థత కారణమే కాదు

కోచ్‌‌‌‌గా తనపై వేటు పడటానికి తన అసమర్థత కారణం కానే కాదని రామన్‌‌‌‌ స్పష్టం చేశాడు. వేరే విషయాలే కారణమన్నాడు. ‘కోచ్‌‌‌‌గా నేను అసమర్థుడినని తేల్చి నాపై వేటు వేసినట్టయితే సీఏసీ నిర్ణయంపై  వాదనే అక్కర్లేదు. కానీ ఇతర కారణాల వల్ల నా అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తే మాత్రం చాలా  అసంతృప్తికరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇండియన్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ను, దేశ ప్రతిష్టను పణంగా పెట్టి  వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకోవడంపై దృష్టి పెట్టిన వ్యక్తులు చేసిన ఆరోపణల వల్ల ఈ నిర్ణయం తీసుకుంటే అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని రామన్‌‌‌‌ అభిప్రాయపడ్డాడు. 

ప్లేయర్ల వల్లేనా?

 తన లెటర్​లో రామన్‌‌‌‌  ఎవరి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ టీమ్‌‌‌‌లో ఉన్న స్టార్ ​కల్చర్ ​గురించే చెబుతున్నాడని అర్థం అవుతోంది. టీమ్‌‌‌‌లోని స్టార్​ కల్చర్ వల్ల మంచి కంటే ఎక్కువ హాని  జరుగుతోందని అతను చెప్పాడు. ఈ లెక్కన టీమ్‌‌‌‌లోని ఒకరిద్దరు స్టార్​ క్రికెటర్లే  కోచ్‌‌‌‌గా రామన్‌‌‌‌ను వద్దనుకున్నారని తెలుస్తోంది.  ‘కొంతమంది ఈ సిస్టమ్‌‌‌‌ కంటే తామే ఎక్కువ అని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా  బాగా ఆడుతున్న ప్లేయర్లు టీమ్‌‌‌‌ కల్చర్​కు కట్టుబడి ఉండాలంటే దాన్ని వాళ్లు నిర్బంధంగా భావిస్తున్నారు. మరి దీన్ని ఓ కోచ్‌‌‌‌గా  నేను అతిగా ఆశించినట్టు అవుతుందేమో మీరే తేల్చాలి.  నా 20 ఏళ్ల కోచింగ్‌‌‌‌ కెరీర్​లో నేను ఎల్లప్పుడూ టీమ్‌‌‌‌కే తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే కల్చర్​ను  సృష్టించా. అంతేకాని ఆటకంటే, టీమ్‌‌‌‌ కంటే ఓ వ్యక్తికే ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే సుదీర్ఘ కాలంగా ఒక వ్యక్తి అభిప్రాయాలకే విలువనిస్తూ.. మిగతావాళ్లను విస్మరించడం వల్ల మొత్తం వ్యవస్థ, ప్రక్రియ దెబ్బతిన్నది’ అని రామన్‌‌‌‌ అన్నాడు. విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఇప్పుడు తప్పుడు దిశలో వెళ్తోందని, ఇద్దరు లెజెండరీ క్రికెటర్లయిన గంగూలీ, ద్రవిడ్‌‌‌‌ దాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు హెల్ప్‌‌‌‌ చేసే కొన్ని సూచనలు తనవద్ద ఉన్నాయని రామన్‌‌‌‌ చెప్పాడు. దాదా, ద్రవిడ్‌‌‌‌ ఆసక్తి చూపిస్తే వాటిని పంచుకుంటానని తెలిపాడు.  
కోచ్‌‌‌‌లకు గౌరవం లేదు: పూర్ణిమా రావు
విమెన్స్‌‌ క్రికెట్‌‌లో కోచ్‌‌లకు తగిన గౌరవం లభించడం లేదని మాజీ కోచ్‌‌ పూర్ణిమా రావు అంటోంది. కారణం లేకుండానే కోచ్​ రామన్‌‌పై వేటు వేశారని అభిప్రాయపడింది. గతంలో తన విషయంలోనూ ఇలానే జరిగిందని చెప్పింది. ‘కోచ్‌‌లను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వాళ్లకు సరైన గౌరవం లభించడం లేదు. ఇదో జబ్బుగా మారింది. దీనికి ప్లేయర్లు, అడ్మినిస్ట్రేటర్స్‌‌, సపోర్ట్‌‌ స్టాఫ్​ ఇలా అందరూ కారణమే. ఇప్పుడిది గేమ్‌‌ను ప్రభావితం చేసే దశకు చేరుకుంది. మిడ్ 2010లో నేను కోచ్‌‌గా బాధ్యతలు తీసుకున్నా. అప్పుడు చాలా ప్రేమగా, సరదాగా, అమాయకంగా ఉండే ప్లేయర్లతో కూడిన టీమ్‌‌ నాకు లభించింది. కానీ, 2017 వరల్డ్​కప్‌‌నకు కొన్ని నెలల ముందు  నన్ను తొలగించారు. దానికి గల కారణాలను నాకు చెప్పలేదు. వరల్డ్‌‌కప్‌‌కు ఒక్క నెల ముందు ఏ కోచ్‌‌ అయినా  టీమ్‌‌ను తయారుచేయగలరని మీరు చెప్పదలచుకున్నారా?  ఇది వరకు తుషార్​ అరోథ్‌‌కు సాధ్యం కాలేదు. ఇప్పుడు 2022 వరల్డ్‌‌కప్‌‌కు ఏడాది ముందు రమేశ్​ పొవార్​కు కూడా సాధ్యం కాబోదు. మన టీమ్‌‌ ఎందుకు బాగా పెర్ఫామ్‌‌ చేస్తుందనే విషయం గురించి అందరూ ఆలోచించడం మానేశారు. నేను జట్టు కోసం ఇంత త్యాగం చేశానని చెప్పదలచుకోలేదు. అయితే ఈ స్థాయికి ఎదిగిన టీమ్‌‌లో భాగం అయినందుకు ఆనందంగా భావిస్తున్నా. ఏ కోచ్‌‌తోనూ ఎవ్వరూ హ్యాపీగా ఉండరు. మరి కోచ్‌‌లు ఏం చేస్తారు? వాళ్లు ప్లేయర్లను గైడ్‌‌ చేస్తారు. ప్రతీ కోచ్‌‌ తనదైన శైలిలో ముందుకెళ్తారు. వాళ్ల కోసం నేనేం చేశానో,  రమేశ్​ పొవార్ (కోచ్‌‌గా తొలి దశలో), తుషార్​ అరోథ్​, రామన్‌‌ టీమ్‌‌ కోసం ఏం చేశారో ప్లేయర్లకు తెలుసు. కానీ, మమ్మల్ని పక్కకు తోసేశారు. ఇది కరెక్టేనా? ఏదో తప్పు జరుగుతోంది. ఈ రకమైన ప్రవర్తనను కొందరు ప్రోత్సహిస్తున్నారు’ అని పూర్ణిమా చెప్పుకొచ్చింది.