ఆక్రమణలు నిజమని తేలితే చర్యలు తీసుకోండి

ఆక్రమణలు నిజమని తేలితే చర్యలు తీసుకోండి

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ జాగ కబ్జా అయితే సర్వే చేసి.. అది నిజమో కాదో తేల్చేందుకు తీరిక లేదా? అని జిల్లా కలెక్టర్‌‌ను హైకోర్టు ప్రశ్నించింది. గత విచారణ సమయంలో సర్వే చేసి ఆక్రమణలు నిజమని తేలితే చర్యలు తీసుకోవాలన్న కోర్టు ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వే చేసేందుకు మళ్లీ 4 నెలల గడువు కావాలని కోరడాన్ని తప్పుబట్టింది. గత ఉత్తర్వుల అమలుపై రిపోర్టు కూడా ఇవ్వలేదని మండిపడింది. ఈసారి సర్వే చేసి కబ్జాదారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ ఉత్తర్వులు అమలు చేయకపోతే తదుపరి విచారణకు కలెక్టర్‌‌ స్వయంగా రావాల్సి ఉంటుందని హెచ్చరించింది. చీఫ్‌‌ జస్టిస్‌‌ సతీశ్​ చంద్రశర్మ, జస్టిస్‌‌ అభినంద్‌‌కుమార్‌‌ షావిలి డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం ఆదేశాలు ఇచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారాం మండలం రాంలింగంపల్లిలోని సర్వే నంబర్లు. 208, 312లోని 177, 591.05 ఎకరాల చొప్పున జాగా కబ్బా అయినా ఆఫీసర్లు చర్యలు తీసుకోవట్లేదని నల్గొండ జిల్లాకు చెందిన అయోధ్యరెడ్డి పిల్‌‌ వేశారు. ప్రభుత్వ లాయర్ కల్పించుకుని, సర్వే చేయడానికి మరో 4 నెలల గడువు కావాలని కలెక్టర్‌‌ కోరుతున్నారని, ఇప్పటికే ఆక్రమణదారులకు నోటీసులు  ఇచ్చామని చెప్పారు. గతంలో సర్వేకు డిజిటల్‌‌ మ్యాపింగ్‌‌ సిద్ధం చేయాలని ఇచ్చిన ఉత్తర్వుల ను ఎందుకు అమలు చేయలేదని, రిపోర్టు ఎందుకు దాఖలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.  4 నెలల్లోగా ప్రైవేట్‌‌ వ్యక్తుల కబ్జా నుంచి సర్కార్‌‌ భూమిని కాపాడాలని ఆదేశించింది..