యాదాద్రిలో రోజుకు 140 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి! : జెన్ కో సీఎండీ హరీశ్

యాదాద్రిలో రోజుకు 140 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి! : జెన్ కో సీఎండీ హరీశ్
  • ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జెన్ కో సీఎండీ హరీశ్ వెల్లడి
  •  ఆరు నెలల్లో ఐదో యూనిట్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌‌లో రోజుకు 140 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తికి కసరత్తు చేస్తున్నట్లు తెలంగాణ జెన్ కో సంస్థ శనివారం ప్రకటించింది. 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4042.5 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అది 7,180 మెగావాట్లకు చేరినట్లు జెన్ కో సీఎండీ హరీశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

2022–23లో రోజుకు సగటున 69.71 మిలియన్ యూనిట్లుగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయగా, 2025–26 నాటికి అది రోజుకు 78.88 మిలియన్ యూనిట్లకు పెరిగినట్లు తెలిపారు. 2026–27 ఆరంభంలో రోజువారీ సగటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 90.23 ఎంయూల (మిలియన్ యూనిట్ల) గరిష్ట స్థాయికి పెరిగిందని స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా యాదాద్రిలో రోజుకు 140 ఎంయూల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకుప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

ఆరు నెలల్లో ఐదో యూనిట్ స్టార్ట్ చేస్తాం..

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు 2017లో ప్రారంభమైనప్పటికీ, 2024 నవంబర్ 3న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలి 800 మెగావాట్ల యూనిట్‌‌ను గ్రిడ్‌‌కు అనుసంధానం చేశారని జెన్ కో సీఎండీ తెలిపారు. ఆ తర్వాత 2025–26లో మరో మూడు 800 మెగావాట్ల యూనిట్లు ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం 7,180 మెగావాట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుతం సింగరేణి ద్వారా నైనీ నుంచి రోజుకు రెండు రైల్వే రేకుల్లో బొగ్గు వైటీపీఎస్ కు చేరుతోందన్నారు. రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతోంది. మిగిలిన పనులను రాబోయే ఆరు నెలల్లో పూర్తిచేసి ఐదో యూనిట్‌‌ను కూడా ప్రారంభించి, మొత్తం 4 వేల మెగావాట్ల పూర్తి సామర్థ్యంతో అన్ని యూనిట్లను రన్ చేస్తూ రోజుకు 140 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం’’ అని ఆయన తెలిపారు.