- మరో 24 మందికి తీవ్ర గాయాలు
టెహ్రాన్: ఇరాన్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సెంట్రల్ మార్కాజీ ప్రొవిన్స్‌లోని సావే-హమేదాన్ ఫ్రీవేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం జరిగిన ఈ ప్రమాదానికి డ్రైవర్ తీవ్రమైన అలసట, నిద్రమత్తే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు ప్రొవిన్షియల్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
కానీ ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే వివరాలను అధికారులు తక్షణమే వెల్లడించలేదు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరాన్‌లో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా 17 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
నాణ్యత లేని వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, సరిపడా అత్యవసర సేవలు అందుబాటులో లేకపోవడమే ఈ భారీ మరణాలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలో పశ్చిమ నగరమైన సనందాజ్ సమీపంలో ఓ ఇంధన ట్యాంకర్ ఇతర వాహనాలను ఢీకొట్టి పేలిపోవడంతో 11 మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.
