‘యాదాద్రి’ స్టేజ్2 నిర్వహణ బీహెచ్ఈఎల్కు! : టీజీ జెన్కో

‘యాదాద్రి’ స్టేజ్2 నిర్వహణ బీహెచ్ఈఎల్కు! : టీజీ జెన్కో
  • టీజీ జెన్​కో నిర్ణయం
  • ఓ అండ్​ ఎం పనుల కోసం ఏటా రూ.190 కోట్లు 
  • బీహెచ్ఈఎల్ పేరుతో ప్రైవేటుపరం చేయొద్దు 
  • జెన్​కో సీఎండీకి టీజీపీఈ  జేఏసీ వినతి

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్–2 ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ పనులను బీహెచ్ఈఎల్​కు ఇవ్వాలని టీజీ జెన్​కో నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం ఏటా రూ.190 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిసింది. ఈ మేరకు టీజీ జెన్​కో యాజమాన్యం ప్రభుత్వం ముందు ప్రపోజల్ పెట్టింది. అయితే, జెన్​కో నిర్ణయాన్ని విద్యుత్ శాఖ ఇంజినీర్ల జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 

బీహెచ్ఈఎల్ పేరుతో ప్రైవేట్​సంస్థలకు ఓ అండ్​ఎం పనులను అప్పగించే కుట్ర జరుగుతోందని, జెన్​కో ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఇంజినీర్లతోనే నిర్వహణ చేపట్టాలని కోరుతోంది. ఈ మేరకు శుక్రవారం టీజీపీఈ జేఏసీ ఆధ్వర్యంలో టీజీ జెన్​కో సీఎండీ హరీశ్ కు వినతిపత్రం అందజేశారు. 

ఓ అండ్ ఎం కోసం ఏటా రూ.190 కోట్లు

నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. జెన్​కో  ఆధ్వర్యంలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యంతో 5 ప్లాంట్లు నిర్మించడానికి రూ.29 వేల కోట్లు కేటాయించారు.

2017లో బీహెచ్ఈఎల్ కంపెనీతో వర్క్ అగ్రిమెంట్లు చేసుకున్నారు. స్టేజ్–1లో ఒకటి, రెండు యూనిట్లు, స్టేజ్​–2లో మూడు, నాలుగు, ఐదు యూనిట్లు పని చేస్తాయి. ఇప్పటికే స్టేజ్–2లో ఒక యూనిట్ పూర్తికాగా ట్రయల్ రన్ కంప్లీట్ చేసుకొని సింక్రనైజేషన్ పూర్తి చేశారు. 

సీఓడీ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ నెలాఖరులో నాలుగు, వచ్చే నెలలో ఐదో యూనిట్ పూర్తికానుంది. కాగా, స్టేజ్–2 ఓ అండ్ ఎం కూడా నిర్మాణ పనులు చేపట్టిన బీహెచ్ఈఎల్ కే అప్పగించాలని నిర్ణయించిన టీజీ జెన్​కో సంస్థ.. ఇందుకోసం ఏడాదికి రూ.190 కోట్లు చెల్లించేలా అగ్రిమెంట్​చేసుకోవాలని భావిస్తోంది.

ప్రైవేట్ పరం చేయొద్దు: టీజీపీఈ జేఏసీ

యాదాద్రి పవర్ స్టేషన్ స్టేజ్–2 ఓ అండ్ ఎం పనులను ప్రైవేట్​పరం చేయొద్దని కోరుతూ టీజీపీఈ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం జెన్​కో సీఎండీ హరీశ్​కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్​ ఎంప్లాయిస్ జేఏసీ కమిటీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్​రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ కంపెనీకి పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన టెక్నాలజీ, ఇంజినీరింగ్ వ్యవస్థ మాత్రమే ఉందని, నిర్వహణ అనుభవం లేదన్నారు.

బీహెచ్ఈఎల్ ముసుగులో ఓ ప్రైవేట్​సంస్థ ఈ పనులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని, ఆ సంస్థ నిర్వాహకులు ఈ వ్యవహారాన్ని గోప్యంగా నడిపిస్తున్నారని ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వ సంస్థ జెన్​కోలో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, కార్మికులు ఉన్నారు. 

కేటీపీఎస్ స్టేజ్–7ను 48 నెలల్లో నిర్మించి, నడిపించిన అనుభవం వీరికి ఉంది. వైటీపీఎస్ స్టేజ్–2 ఓ అండ్ ఎం పనులను సైతం జెన్​కో ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. ఈ పనులను బీహెచ్ఈఎల్ పేరుతో ప్రైవేట్ సంస్థకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు భూపాల్ రెడ్డి, తాజుద్దీన్ బాబా, ఈశ్వర్ గౌడ్, నెహ్రూ, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, సదానందం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.