Yashasvi Jaiswal: జైశ్వాల్‌కు లైన్ క్లియర్.. ముంబైకే ఆడనున్న టీమిండియా ఓపెనర్

Yashasvi Jaiswal: జైశ్వాల్‌కు లైన్ క్లియర్.. ముంబైకే ఆడనున్న టీమిండియా ఓపెనర్

ముంబై క్రికెటర్ యశస్వి జైశ్వాల్ డొమెస్టిక్ క్రికెట్ లో తన సొంత రాష్ట్రమైన ముంబైకే ఆడడానికి అనుమతి లభించింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) తన నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) దరఖాస్తును ఉపసంహరించుకోవాలని చేసిన అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఈ టీమిండియా ఓపెనర్ రాబోయే 2025–26 దేశీయ క్రికెట్ సీజన్‌లో ముంబై తరపున కొనసాగేందుకు సిద్ధమవుతున్నాడు.

23 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఈ సంవత్సరం ప్రారంభంలో NOC కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతను గోవాకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. అయితే అంతలోనే తన మనసు మార్చుకొని మే 2025లో తన దరఖాస్తును రద్దు చేయమని అభ్యర్థిస్తూ MCAకి జైశ్వాల్ ఇమెయిల్ పంపాడు.

"గోవాకు మారడానికి నాకు కొన్ని కుటుంబ ప్రణాళికలు ఉన్నాయి. నా నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ని ఉపసంహరించుకోవాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ సీజన్‌లో నన్ను ముంబై తరపున ఆడటానికి అనుమతించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ ని  హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. నేను బీసీసీఐకి లేదా గోవా క్రికెట్ అసోసియేషన్‌కు నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమర్పించలేదు" అని జైస్వాల్ ఈమెయిల్‌లో రాశాడు.

►ALSO READ | Nathan Lyon: ఇండియాలో సిరీస్ గెలవాలి.. రిటైర్మెంట్‌పై 556 టెస్ట్ వికెట్ల వీరుడు ఆసక్తికర వ్యాఖ్యలు

MCA అధ్యక్షుడు అజింక్య నాయక్ ఈ విషయాన్ని ధృవీకరించారు. "జైస్వాల్ NOC దరఖాస్తు ఉపసంహరణను మేము అంగీకరించాము మరియు రాబోయే దేశీయ సీజన్లో అతను ముంబై తరపున ఆడటానికి అందుబాటులో ఉంటాడు" అని అన్నారు.

ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించడం సహజం. గతంలో ముంబై జట్టులో క్రమం తప్పకుండా చోటు దొరకని ఆటగాళ్లు వేరే రాష్ట్రం తరపున ఆడేవారు. కానీ జైశ్వాల్ స్టార్ బ్యాటర్. అతను భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్. ముంబై జట్టులో అతనికి ఖచ్చితంగా చోటు ఉంటుంది. అయినప్పటికీ గోవాకు ఆడాలనుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.

అర్జున్ టెండూల్కర్, సిద్ధేష్ లాడ్ ముంబై జట్టులో చోటు దక్కకపోవడంతో వీరు గోవా తరపున ఆడుతున్నారు. జైశ్వాల్ కూడా గోవా జట్టులో చేరాలని ఆశించినా తన నిర్ణయాన్ని మార్చుకుని మరల ముంబైకే ఆడాలనుకున్నాడు.