శ్రీలంక బాంబ్ బ్లాస్ట్ నుంచి తృటిలో తప్పించుకున్న YCP నేత

శ్రీలంక బాంబ్ బ్లాస్ట్ నుంచి తృటిలో తప్పించుకున్న YCP నేత

శ్రీలంకలో ఉగ్రవాదుల పేలుళ్ల ఘటనను ప్రత్యక్షంగా చూడటంతో పాటు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు YCP అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి గుడివాడ అమర్‌ నాథ్‌. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్‌ ప్రార్థనలు జరిగిన చర్చితో పాటు కింగ్స్‌జ్యూరీ హోటల్‌లో ఉగ్రవాదులు పేలుళ్లకు తెగబడ్డారు. ఈ మారణహోమంలో సుమారు 320 మంది మృత్యువాత పడగా, 500 మందికి పైగా  గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో  అమర్‌ నాథ్‌ అక్కడే ఉన్నారు. స్నేహితులతో టూర్‌కి వెళ్లిన ఆయన  కింగ్స్‌జ్యూరీ హోటల్‌కు చెందిన ఫ్లాట్‌లోనే బసచేశారు. పేలుళ్ల  సమయంలో కూడా ఫ్లాట్‌లోనే ఉన్నారు.

అమర్‌ నాథ్‌ బసచేసిన  పక్క అపార్ట్‌మెంట్‌లో కూడా పేలుళ్లు జరిగాయి. ఘటన జరిగిన వెంటనే ఆయన  స్నేహితులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వాస్తవానికి టూర్‌ షెడ్యూల్‌ ప్రకారం సోమవారం రాత్రి శ్రీలంక నుంచి బయలుదేరాలి. కాని ఈ ఘటనతో ఆదివారం ఉదయమే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా  అక్కడ కూడా బాంబులు పెట్టారన్న సమాచారంతో విమాన రాకపోకలను నిలిపివేశారు. దీంతో రాత్రంతా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి ఉదయం చెన్నై విమానం ఎక్కి అక్కడి నుంచి సాయంత్రం విశాఖ చేరుకున్నారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానమే తమను ఆ ఘటన నుంచి రక్షించాయన్నారు అమర్ నాథ్.