రాష్ట్రంలో మళ్లీ బీజేపీదే అధికారం యడియూరప్ప

రాష్ట్రంలో మళ్లీ బీజేపీదే అధికారం యడియూరప్ప

బెంగళూరు: కర్నాటకలో తమ పార్టీ 130 నుంచి 135 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని బీజేపీ సీనియర్​ నేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప జోస్యం చెప్పారు. అలాగే, వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఓడిపోతారని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మంత్రి, బీజేపీ అభ్యర్థి సోమన్న వరుణ నియోజకవర్గంలో గెలుస్తారు. అది కూడా నేను ఒకటి రెండు రోజులు అక్కడే ఉండి, ప్రత్యక్షంగా పరిశీలించాను కాబట్టే చెబుతున్నా. సోమన్న డే అండ్​ నైట్​ కష్టపడ్డారు. సిద్ధరామయ్య ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నారు. 

‘‘ఈరోజు చెబుతున్నా.. మాకు కనీసం 130 నుంచి 135 సీట్లు వస్తాయి. ఎన్నికల తర్వాత మళ్లీ సమావేశం కాబోతున్నాం. నేను గతంలో ఏం చెప్పానో అది నిజమైంది. ఇప్పుడు కూడా చెబుతున్నాను. 135 సీట్లు దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం’’ అని యడియూరప్ప అన్నారు. ‘‘ప్రధాని నరేంద్ర మోడీ తన ఏ ఒక్క ప్రసంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను పేర్కొనలేదు. ఎందుకంటే కర్నాటకకు కేంద్రం అత్యధిక గ్రాంట్లు విడుదల చేసింది. అదే కర్నాటక అభివృద్ధికి కారణం. ఆ పనులను పునరావృతం చేయవలసిన అవసరం లేదు. కర్నాటక అభివృద్ధి పథంలో ఎలా నడుస్తుందో ప్రధానికి తెలుసు" అని ఆయన పేర్కొన్నారు.