గ్రేటర్ హైదరాబాద్‎కు ఎల్లో అలెర్ట్ జారీ.. సిటీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

గ్రేటర్ హైదరాబాద్‎కు ఎల్లో అలెర్ట్ జారీ.. సిటీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్రేటర్‎లో వచ్చే మూడు రోజులు (శని, ఆది, సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో వాటర్‌ లాగింగ్‌ ప్రాంతాల్లో సిబ్బందిని నియమించి, డ్రైనేజీ, వరద ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 

జంట జలాశయాల గేట్లు ఓపెన్

సిటీ జంట జలాశయాలైన ఉస్మాన్​సాగర్‌, హిమాయత్​సాగర్‏కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. క్యాచ్​మెంట్‌ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా మెట్రోవాటర్‌ బోర్డు అధికారులు అప్రమత్తమై గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్​సాగర్​ఫుల్ ట్యాంక్​లెవెల్​ 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.85 అడుగుల నీటి నిల్వ ఉంది. దీంతో అధికారులు 8 గేట్లను 3 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ప్రస్తుతం ఈ జలాశయంలోకి ఇన్​ఫ్లో 900 క్యూసెక్కులు కాగా, ఔట్​ఫ్లో 2,704 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్​ సాగర్​ పూర్తి సామర్థ్యం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1763.10 అడుగులు ఉంది. 2 గేట్లను 3 అడుగుల మేరకు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఈ జలాశయం ఇన్​ఫ్లో 1,800 క్యూసెక్కులు కాగా, ఔట్​ఫ్లో 2300 క్యూసెక్కులు ఉంది.