హబూబ్ నగర్ కలెక్టరేట్/మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : గత ప్రభుత్వం యువతను కేవలం ఓటు బ్యాంకుగా చూసిందని, ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం వారి భవిష్యత్కోసం స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీలు, అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తూ నాణ్యమైన శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్ నగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన క్రీడలు, యువత వారోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొని, సుమారు 500 మంది యువతకు జాబ్ మేళా ఆఫర్ లెటర్లను అందజేశారు.
అంతకుముందు జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రసవించిన మహిళలకు ‘యెన్నం హెల్త్ కిట్’లను పంపిణీ చేసిన ఆయన, తల్లిపాలు శిశువులకు అమృతం లాంటివని, ప్రతి ఒక్కరూ తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించాలని సూచించారు. ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ ద్వారా వేలాది మంది చిన్నారులకు పాలు అందడం అభినందనీయమని, నవజాత శిశువుల తల్లులు వైద్యుల సూచనలు పాటించాలని కోరారు. కార్యక్రమాల్లో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
