పరేడ్ గ్రౌండ్ లో యోగా వేడుకలు...హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ శుక్లా

పరేడ్ గ్రౌండ్ లో యోగా వేడుకలు...హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ శుక్లా

పద్మారావునగర్, వెలుగు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌లో నిర్వహించిన ముందస్తు యోగా వేడుకలకు స్పందన లభించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన 24 గంటల కౌంట్‌‌డౌన్ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరై ఆసనాలు వేశారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువతీయువకులు, చిన్నారులు పాల్గొన్నారు. 

గవర్నర్ మాట్లాడుతూ.. యోగా అనేది శరీరం, మనసు, ఆత్మలను అనుసంధానం చేసే జీవన విధానమన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. యోగా  విశ్వశాంతికి దోహదపడే అద్భుత సాధనమని తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చొరవతోనే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. లక్ష్మణ్, రాంచందర్ రావు, దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఒత్తిడిని జయించడానికి, విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడానికి యోగా ఒక దివ్యౌషధంలా పని చేస్తుందన్నారు. ప్రతిఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.