నోట్లో వేస్కోగానే పొగలొస్తున్నాయ్.. ఇదేం బిస్కెట్‌రా బాబూ

నోట్లో వేస్కోగానే పొగలొస్తున్నాయ్.. ఇదేం బిస్కెట్‌రా బాబూ

నైట్రోజన్ బిస్కెట్ స్టాల్ గురించి ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా. కానీ ఇప్పుడు దీని గురించి మధ్యప్రదేశ్ లో ఎవర్ని అడిగినా టక్కున చెప్పేస్తారు. వివరాల్లోకి వెళితో ఎంపీలో జరిగే భింద్ జాతరకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడికి పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. జాతర చివరి రోజుల్లో పలు వస్తువులను చౌకగా కొనుగోలు చేసేందుకు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. పగలు, రాత్రి అేనే తేడా లేకుండా భారీ సంఖ్యలో జనం ఇక్కడికి తరలివస్తుంటారు. అయితే ఈ జాతరలో ఓ ప్రత్యేకమైన స్టాల్ ఉంది. అదే నైట్రోజన్ బిస్కెట్ స్టాల్.

భింద్‌లో గత నెల రోజులుగా జరుగుతున్న ఈ జాతరలో నత్రజని బిస్కెట్లు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని తిని కొత్త అనుభూతిని పొందుతుంటారు. ఎందుకంటే భింద్ జాతరలో తొలిసారి నైట్రోజన్ బిస్కెట్లు అమ్మకానికి వచ్చాయి. ఇవి ఇతర బిస్కెట్ల కంటే భిన్నంగా ఉంటాయి. దీన్ని తిన్న వెంటనే, మీ నోటి నుండి పొగ రావడం ప్రారంభమవుతుంది. చాలా మంది నోట్లో బిస్కెట్ తీసుకున్న తరువాత వచ్చే పొగతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. నైట్రోజన్ బిస్కెట్లు తినడానికి పిల్లలు కూడా చాలా ఉత్సాహం కనబరుస్తున్నారు.

నైట్రోజన్ బిస్కెట్ అంటే మామూలు బిస్కెట్ లాంటిదే. కానీ అందులో నైట్రోజన్ గ్యాస్ మిక్స్ అవడం వల్ల తిన్నవారి నోట్లో పెట్టుకోగానే నోటి నుంచి పొగ వస్తుంది. జాతరలో నైట్రోజన్ బిస్కెట్లు తిన్న వారి నోటి నుంచి కొంత కాలంగా పొగ వస్తూనే ఉంటుంది. భింద్ ఫెయిర్‌లో ఈ నైట్రోజన్ బిస్కెట్లు ఈ సారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.

భింద్‌లో తొలిసారిగా ఈ బిస్కెట్‌ను తీసుకొచ్చినట్లు నైట్రోజన్ బిస్కెట్ స్టాల్ యజమాని మున్నా జీ చెబుతున్నారు. చల్లగా ఉండే ఈ నైట్రోజన్ గ్యాస్ కోసం ఇతర జిల్లాల నుంచి ఈ గ్యాస్ తెప్పిస్తామన్నారు. దీన్ని బిస్కెట్లలో కలిపి నోటిలో ఉంచితే లోపల నుంచి పొగలు వస్తాయన్నారు. ఇది ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుంది. పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువ మంది దీన్ని కొనడానికి ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పగటిపూట పొగ సరిగ్గా కనిపించదు. కానీ రాత్రికి ఈ దృశ్యం భిన్నంగా ఉంటుంది. రాత్రిపూట నైట్రోజన్ బిస్కెట్లకు గిరాకీ ఎక్కువ కావడానికి ఇదే కారణం అని స్టాల్ యజమాని చెబుతున్నారు.