
నేటితరం ఉద్యోగులు చెబుతున్న మాటలు
గ్లోబల్ సర్వేలో వెల్లడి
ఇండియన్ ఉద్యోగుల్లో కూడా ఇదే అభిప్రాయం
బాస్ ఉద్యోగమా..? అమ్మో ఎన్ని టెన్షన్లుంటాయో.. అనేది ఒకప్పటి మాట. కానీ బాస్ కంటే మేమే ఆ ఉద్యోగాన్ని బాగా చేస్తామనేది నేటితరం సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌తో చెబుతున్న మాట. బాస్ ప్లేస్‌లో మేముంటే రఫాడిస్తామంటూ బోల్డ్‌గా చెప్పేస్తున్నారు నేటితరం ఉద్యోగులు. ఇలా చెబుతున్న ఉద్యోగుల్లో మన వారు కూడా ఉన్నారు. గ్లోబల్‌గా చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మేనేజర్స్ జాబ్‌ను వారి కంటే మేమే బాగా చేయగలమని ఉద్యోగులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరిలో మిలీనియల్స్(73 శాతం), 1995 నుంచి 2015 మధ్యలో పుట్టిన జనరేషన్ జెడ్(70 శాతం) వారు ఉన్నారు. క్రోనోస్ ఇన్‌కార్పొరేటెడ్ వర్క్‌ఫోర్స్ ఇన్‌స్టిట్యూట్ తరుఫున ఫ్యూచర్ వర్క్‌ప్లేస్ ఈ సర్వేను చేపట్టింది. 2018 జూలై 31 నుంచి ఆగస్ట్ 9 వరకు ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, యూకే, యూఎస్ వంటి దేశాల్లో 3000 మంది ఉద్యోగులపై ఈ సర్వే చేశారు.
ఏ, బీ, సీ, డీ, ఎఫ్ అనే గ్రేడ్‌ల ఆధారంగా ఈ సర్వేను విడుదల చేశారు. ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరు తమ మేనేజర్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపరుచుకోవాలని సూచించారు. అంతేకాక పనితీరుకు సంబంధించిన విషయాలను మంచిగా నిర్వహించాలని కూడా చెప్పారు. కమ్యూనికేషన్, పనితీరును పెంచేందుకు బాస్‌ల సామర్థ్యం ఏ మేరకు ఉందనే విషయాలపై కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మొత్తంగా 26 శాతం ఉద్యోగులు మాత్రమే తమ బాస్‌లకు పాస్ మార్క్‌లు ఇస్తూ ఏ గ్రేడ్ ఇచ్చారు. 37 శాతం మంది బీ గ్రేడ్, 25 శాతం మంది సీ గ్రేడ్, మరో 4 శాతం మంది ఉద్యోగులు ఎఫ్ గ్రేడ్ ఇచ్చి సరిపెట్టేశారు. ఇండియన్ ఎంప్లాయీస్ అయితే తమ మేనేజర్లతో చాలా సంతృప్తికరంగా ఉన్నట్టు చెప్పారు. ఇండియాలోని ప్రతి10 మంది మేనేజర్లకు ఎనిమిది మందికి ఏ లేదా బీ గ్రేడ్ ఇచ్చారు. ఫ్రెంచ్, జర్మన్, యూకే వర్కర్లైతే వారి బాస్‌ల విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. వారి మేనేజర్స్ పనితీరు విషయంలో ఈ దేశాల ఉద్యోగులు ప్రతి కేటగిరీలో కూడా కింది మూడు గ్రేడ్‌లే ఇచ్చినట్టు సర్వే చెప్పింది.
నెం.1 ర్యాంకిచ్చినా.. మేమే బాగా చేస్తాం…
అన్ని కేటగిరీల్లో మేనేజర్లకు నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చినా కూడా.. ఇండియన్ ఉద్యోగుల్లో 95 శాతం మంది బాస్‌ల జాబ్‌ను వారి కంటే తామే మెరుగ్గా చేయగలమని చెప్పుకొచ్చారు. అన్ని సమయాల్లో కూడా మేమే బాగా చేస్తామని 47 శాతం మంది చెబితే.. కొన్ని సార్లు మాత్రమే మేము బాగా చేయగలమంటూ 48 శాతం మంది చెప్పారు. ఇదే సెంటిమెంట్ 87 శాతం మంది మెక్సికన్ వర్కర్లు, 71 శాతం మంది ఫ్రెంచ్ వర్కర్లలోనూ కనిపించింది. కెనడాలో అయితే 61 శాతం మంది, యూఎస్‌లో అయితే 59 శాతం మంది ఉద్యోగులు వారి బాస్‌ల జాబ్‌ను తామే బాగా చేస్తామంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. పని వాతావరణంలో మార్పులు కొనసాగుతున్నాయని, కొత్త జనరేషన్స్ వర్క్‌ఫోర్స్‌లోకి వస్తున్నారని క్రోనస్ వర్క్‌ప్లేస్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాయిస్ మెరోనీ చెప్పారు. వారి అభిరుచులు, ఆలోచనలు మారుతూ ఉన్నాయని పేర్కొన్నారు. ఒకవేళ మిలీనియల్స్ మేనేజర్లు పెరిగితే.. మేనేజ్‌మెంట్ పద్ధతులు, వర్కింగ్ స్టయిల్స్ కూడా మారుతాయని చెప్పారు.