తెలంగాణలో 27 లక్షల మంది స్టూడెంట్స్ కు .. యంగ్ ఇండియా కిట్

తెలంగాణలో 27 లక్షల మంది స్టూడెంట్స్ కు .. యంగ్ ఇండియా కిట్
  • స్కూళ్లు, హాస్టళ్లు తెరిచిన ఫస్ట్​ వీక్​లోనే ఇచ్చేలా ఏర్పాట్లు
  • మెగా కిట్​లో 22 రకాల నాణ్యమైన వస్తువులు
  • గురుకుల, సర్కార్ బడి విద్యార్థులకు ఇవ్వనున్న ప్రభుత్వం 
  • కామన్​ కిట్​తో పాటు రెసిడెన్షియల్ ​స్టూడెంట్స్​కు మరిన్ని వస్తువులు​
  • సుమారు రూ.1,600 కోట్లు ఖర్చవుతుందని అంచనా  
  • త్వరలో సెంట్రలైజ్డ్ టెండర్లు పిలవాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గవర్నమెంట్​ స్కూళ్లు, గురుకులాల్లో చదివే 27.11 లక్షల మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే లక్ష్యంగా ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే అకడమిక్​ ఇయర్​ తొలి వారంలోనే ఈ కిట్​స్టూడెంట్లకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే తేడా లేకుండా విద్యార్థులందరికీ ఒకే రకమైన, నాణ్యమైన సామగ్రిని ఇవ్వనున్నారు. గతంలో జిల్లాలు, శాఖల వారీగా వేర్వేరుగా టెండర్లు పిలవడంతో అక్కడక్కడా నాణ్యతలో లోపాలు,  సామగ్రి సరఫరాలో జాప్యం జరిగేది. దీన్ని అధిగమించేందుకు ఈసారి స్టేట్ లెవెల్ లోనే ‘సెంట్రలైజ్డ్ టెండర్’ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందు కోసం సుమారు రూ.1,500 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. బల్క్  టెండర్ల వల్ల ధరలు తగ్గడంతో పాటు, క్వాలిటీ కంట్రోల్ ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి నేరుగా ప్రొక్యూర్​ చేయడం లేదా పేరున్న భారీ కంపెనీల ద్వారా నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసి విద్యార్థులకు ‘ఒకే టెండర్ -– ఒకే క్వాలిటీ’ అనే కాన్సెప్ట్​లో కిట్​ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

కార్పొరేట్​ స్థాయిలో.. 


ప్రస్తుతం ఒక్కో సంక్షేమ గురుకులంలో ఒక్కో రకమైన సామగ్రి ఇస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా 22 రకాల వస్తువులతో ‘మెగా కిట్’ను రూపొందించారు. అందులో డే స్కాలర్లకు, రెసిడెన్షియల్ విద్యార్థులకు కామన్ గా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, జత షూ, నాలుగు జతల సాక్సులు, బెల్ట్, టై, ఐడీ కార్డులు ఉంటాయి. ఇన్నాళ్లు ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో మాత్రమే ఎక్కువ వస్తువులు ఇస్తుండగా.. ఇకపై బీసీ, మైనారిటీ, సాధారణ పాఠశాలల విద్యార్థులకూ అదే స్థాయిలో సామగ్రిని అందించనున్నారు. గురుకులాల్లో ఉండి చదువుకునే దాదాపు 10.39 లక్షల మంది విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గని రీతిలో అదనపు వసతులు కల్పించనున్నారు. హాస్టల్ విద్యార్థులకు  స్పోర్ట్స్ షూ, ట్రాక్ సూట్, చలికి తట్టుకునేలా హుడీలు (జాకెట్లు), రాత్రి వేళల్లో వేసుకునేందుకు నైట్ డ్రెస్ లు, దుప్పట్లు, కార్పెట్లు ఇవ్వనున్నారు. భోజనానికి ప్లేట్లు, గ్లాస్ తో కూడిన డైనింగ్ సెట్, సామాను దాచుకోవడానికి ట్రంక్ బాక్సులు  మెగా కిట్ లో 
ఉండనున్నాయి.

నాణ్యతలో రాజీపడొద్దు

టెండర్ల ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తేల్చిచెప్పారు. ఎవరికో ఉపాధి కల్పించడం, కాంట్రాక్టర్లకు మేలు చేయడం ముఖ్యం కాదని, విద్యార్థులకు నాణ్యమైన వస్తువులు అందడమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో  రాజీపడినా, కిట్​ సమయానికి అందకపోయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మెగా కిట్ పంపిణీలో భాగంగా ఇస్తున్న యూనిఫామ్​ల కుట్టు బాధ్యతలను మహిళా  సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.